ట్రంప్ ముఖచిత్రం ఉన్న అమెరికా పాస్‌పోర్టుల (US passports)ను త్వరలో విడుదల చేయాలని నిర్ణయించింది. అమెరికా 250వ స్వాతంత్య్ర వేడుకలకు గుర్తుగా పరిమితి సంఖ్యలో వీటిని రూపొందించనున్నట్లు తొలుత పలు మీడియాల్లో కథనాలు వచ్చాయి. తాజాగా యూఎస్ విదేశాంగశాఖ దీన్ని ధ్రువీకరించింది.
అమెరికా 250వ స్వాతంత్య్ర వేడుకలు జులైలో జరగనున్నాయి. ఈ తరుణంలో అమెరికా ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ సందర్బంగా ప్రత్యేకంగా రూపొందించిన యూఎస్ పాస్‌పోర్టులు విడుదల చేసేందుకు విదేశాంగ శాఖ కసరత్తు చేస్తుందని విదేశాంగశాఖ ప్రతినిధి టామీ పిగాట్ ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ పాస్‌పోర్టులకు ఎలాంటి అదనపు రుసుము ఉండదని విదేశాంగ వర్గాలు వెల్లడించాయి.
పాస్‌పోర్టులు విడుదల చేయనున్న విషయాన్ని వైట్‌హౌస్ కూడా ఎక్స్ వేదికగా ధ్రువీకరించింది. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా అది పంచుకుంది. అందులో స్వాతంత్య్ర ప్రకటన పత్రంపై ట్రంప్ ఫొటో ఉండగా.. దాని కింద బంగారు రంగులో ఆయన సంతకం ఉంది. మరొక దానిలో యూఎస్ వ్యవస్థాపక పితామహుల చరిత్రాత్మక ఫొటో ఉంది. ప్రస్తుతం ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం యూఎస్ పాస్‌పోర్టులపై చరిత్రలోని ముఖ్య ఘట్టాలు, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వంటి చారిత్రక ప్రదేశాలు ముద్రించి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ చిత్రంతో పరిమితి సంఖ్యలో పలు పాస్‌పోర్టులను రూపొందించాలనుకోవడం గమనార్హం. కాగా.. 250 స్వాతంత్య్ర వేడుకలకు గుర్తుగా ట్రంప్ సంతకం ఉన్న కరెన్సీ నోట్లను విడుదల చేయనున్నట్లు ట్రెజరీశాఖ ప్రకటించింది. దీంతో ఆ దేశ కరెన్సీ నోట్లపై సంతకం చేయబోయే తొలి అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్ర సృష్టించనున్నారు.










