తెలంగాణ మహిళా జర్నలిస్టులకు రెండు రోజుల శిక్షణ తరగతుల కార్యక్రమం బేగంపేట, ప్లాజా హోటల్ లో చైర్మన్ అల్లం నారాయణ నేతృత్వంలో నేడు ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, మహిళా కమిషనర్ చైర్ పర్సన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మహిళా జర్నలిస్టులు పలు డిమాండ్లను మంత్రుల ముందు ఉంచారు. కాగా, మహిళా జర్నలిస్టుల ముఖ్యమైన ప్రతిపాదనలకు దాదాపు వారు ఆమోదం తెలపడం విశేషం.
తెలంగాణ రాష్ట్రంలో మహిళా జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా మీడియా సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం తరపున కచ్చితంగా తోడ్పాటు అందిస్తామని రాష్ట్ర మహిళా మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డిలు హామీ ఇచ్చారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ తరపున మహిళా జర్నలిస్టులకు ఆర్ధిక సాయం కింద 5 లక్షల రూపాయలు కూడా ఇస్తామని వారు తెలిపారు.
అంతే కాకుండా మహిళా జర్నలిస్టులు ఈ సమావేశంలో చేసిన ప్రతిపాదనలన్నింటినీ మంత్రులం, మహిళా కమిషనర్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, విప్ శ్రీమతి గొంగిడి సునీతా మహేందర్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి కేసిఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. జర్నలిస్టుల పిల్లలకు పాఠశాలలో ఫీజు రాయితీ కి ఇస్తున్న మెమోను కచ్చితంగా అమలు పరిచే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఈ వర్క్ షాప్ మహిళా జర్నలిస్టులే నిర్వహిస్తారు : అల్లం నారాయణ
జర్నలిస్టుల అస్తిత్వాన్ని, పనిచేసే చోట ఉన్నా వివక్షను ఇతర సున్నితమైన సమస్యలను చర్చించడానికి ఈ ప్రత్యేక వర్క్ షాప్ ఏర్పాటు చేసినట్లు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్, అల్లం నారాయణ అన్నారు. రెండు రోజులపాటు జరిగే ఈ వర్క్ షాప్ మహిళా జర్నలిస్టు లే నిర్వహిస్తారని, దీనికి సంబంధించిన అనేక అంశాలపై చర్చలు జరుపుతారని అన్నారు. మీడియా అకాడమీ గత నెలలో నిర్వహించిన దళిత జర్నలిస్టుల శిక్షణా తరగతుల కు మంచి స్పందన వచ్చిందని రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి 2000 మంది జర్నలిస్టు లు పాల్గొన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
కత్తి, కలం రెండింటిని సమర్థవంతంగా నిర్వహించే శక్తి మహిళది : మంత్రి సత్యవతి రాథోడ్
కత్తి, కలం రెండింటిని సమర్థవంతంగా నిర్వహించే శక్తి మహిళది. కుటుంబంలో తనకు కావల్సినవి అన్ని త్యాగం చేసి కూడా కుటుంబాన్ని సమర్థవంతంగా నిర్వహించే శక్తి మహిళకు ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని మహిళా జర్నలిస్టులందరినీ ఒకచోటకు తీసుకొచ్చి, శిక్షణ ఇచ్చే ఈ కార్యక్రమం చాలా మంచిది. మీడియా అకాడమీ ఆధ్వర్యంలో దళిత జర్నలిస్టులకు కూడా ఇటీవలే మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. మా మహబూబాబాద్ జిల్లా నుంచి కూడా దళిత జర్నలిస్టులు వచ్చారు. 2000 మంది దళిత జర్నలిస్టులు శిక్షణా తరగతులకు రావడం సంతోషంగా ఉందన్నారు.
2000 మంది దళిత జర్నలిస్టులు వస్తే…400 మంది మాత్రమే మహిళా జర్నలిస్టులున్నారు. మా మహిళా జర్నలిస్టుల సంఖ్య ఇంకా పెరగాలి. జర్నలిజంలో మహిళా జర్నలిస్టుల సంఖ్య పెంచడానికి రిజర్వేషన్ పెట్టాలా? సామర్థ్యం మీదనే ఎక్కువ మందికి అవకాశాలు కల్పించాలా అనేది చర్చించాల్సిన అవసరం ఉందన్నారు.
జర్నలిజంలో రోజురోజకీ కొత్త, కొత్త విధానాలు, సాంకేతిక పరిజ్ఞానం వస్తోంది. ఫలితంగా తీవ్ర పోటీ నెలకొంది. కాబట్టి ఈ పోటీ జర్నలిజంలో నిలదొక్కుకోవడం నిజంగా మహిళలకు ఓ ఛాలెంజ్ అన్నారు. మహిళా జర్నలిస్టులకు వృత్తిపరంగా అనేక ఇబ్బందులు ఉంటాయి. వ్యంగ్యపు మాటలు ఉంటాయి. కానీ మీరంతా వీటన్నింటిని తట్టుకుని నిలబడ్డారు. రాణిస్తున్నారు. ఇటీవలే మహిళా దినోత్సవం సందర్భంగా మా యువ నాయకులు మంత్రి కేటిఆర్ గారి చేతుల మీదుగా మహిళా జర్నలిస్టులను సన్మానం చేసుకున్నాం.
ఉమ్మడి రాష్ట్రంలో నేను ఎమ్మెల్యే గా ఉన్నాను. ఎప్పుడూ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు జరిగినట్లు నాకు తెలువదు. కానీ తెలంగాణలో సీఎం కేసిఆర్ గారి నాయకత్వంలో మీడియా అకాడమీ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి.
ఇలా కలుసుకోవడం సంతోషంగా ఉంది : మంత్రి సబితా ఇంద్రారెడ్డి
తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత సీఎం కేసిఆర్ గారు ఒక్కో రంగాన్ని అభివృద్ధి చేస్తున్నారు. మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి నేతృత్వంలో మీడియా రంగాన్ని అభివృద్ది చేస్తున్నారు. మహిళలు వివక్ష స్టేజ్ దాటారు. సమాజంలో సగం ఉన్నారు. అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. మీ డిమాండ్లను కచ్చితంగా చర్చించి, ముఖ్యమంత్రి కేసిఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తామని మంత్రి సబిత హామీ ఇచ్చారు.
మహిళా జర్నలిస్టులు అందరూ కలుసుకునే విధంగా మహిళా మీడియా సెంటర్ కోసం ప్రయత్నం చేస్తాం. జర్నలిస్టుల పిల్లల విద్య కోసం కూడా సీఎం కేసిఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తాం. జర్నలిజం అంటే ఆషామాషీ కాదు. అయినా ఈ రంగాన్ని ఎంచుకున్న మీకు అభినందనలు. మేము రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కొంత ఇబ్బందిగా ఫీల్ అయ్యాం. కానీ ఇపుడు అంత ఇబ్బంది లేదు. అయినా మీరంతా ఛాలెంజ్ గా తీసుకుని చేస్తున్నారు. ఈ శిక్షణా తరగతులను మహిళా జర్నలిస్టులు సద్వినియోగం చేసుకుని విజయవంతం కావాలని కోరుకుంటున్నానని మంత్రి సబిత ఆశాభావం వ్యక్తం చేశారు.
కలర్ ఫుల్ గా ఉంది : మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి
ఇంతమంది మహిళా జర్నలిస్టుల ఒక్క దగ్గర కనపడంతో హల్ అంతా మంచి కలర్ ఫుల్ గా ఉందన్నారు. జర్నలిజం అనేది వినూత్నమైన రంగం. ప్రజాస్వామ్య రక్షణలో నాలుగవ స్తంభం. పురుషులకే సొంతం అన్న ముద్ర ఉన్న ఈ రంగంలో మహిళలు ఇంతమంది ఉండడం, నిలదొక్కుకోవడం శుభ పరిణామం. సవాళ్ళను ఛేదిస్తూ ముందుకు సాగుతున్నందుకు మీకు నా అభినందనలు. వృత్తిపరంగా పని చేసే చోట వేధింపులను అరికట్టే విధంగా మీడియాలో కమిటీలు వేయాలని మీడియా అకాడమీని కోరుతున్నానని సునీతా లక్ష్మారెడ్డి
మహిళల మీడియా అకాడమీ ఉండాలి : ప్రభుత్వ విప్ గొంగిడి సునీత
మహిళలు ఏ స్థాయిలో ఉన్నా వారి పట్ల వివక్ష ఉంది. ఎన్ని వత్తిళ్లు ఉన్నా.. మహిళలు విజయం సాధిస్తూ ఉనికిని చాటుతున్నారు. మహిళా జర్నలిస్టుల ప్రతిభకు తక్కువ లేదు…కానీ అవకాశాలు తక్కువ ఉన్నాయి. అందుకే మహిళల మీడియా అకాడమీ ప్రత్యేకంగా తీసుకురావాలని గొంగిడి సునీత డిమాండ్ చేశారు.
మహిళా జర్నలిస్టులు పెట్టిన ప్రతిపాదనలివే…
1) మహిళా జర్నలిస్టులకు ప్రత్యేకంగా మీడియా సెంటర్ ఏర్పాటు చేయాలి.
2) మహిళా జర్నలిస్టులు మరింత సమర్థవంతంగా పనిచేయాలంటే వారి పిల్లల కోసం క్రష్ లు ఏర్పాటు చేయాలి, 3) 3) పనిచేసే సంస్థల్లో ఫీడింగ్ కేంద్రాలు పెట్టాలి.
4) మహిళా జర్నలిస్టులపై వేధింపుల నిరోధానికి కమిటీలు వేయాలి.
5) మహిళా జర్నలిస్టులు స్వతంత్రంగా ఎదగడానికి దళిత బంధువలె కనీసం 5 లక్షల రూపాయల ఆర్ధిక సాయం అందించాలి.
6) మహిళా జర్నలిస్టుల హక్కులను కాపాడాలి, కనీస వేతనాలు ఇప్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి.
7) నెలసరి మొదటి రోజు ఇచ్చే సెలవును వర్తింపజేయాలి, నైట్ డ్యూటీ చేసే మహిళలకు రక్షణ, రవాణా వసతి కల్పించాలి.