చైనా చాలా కాలంగా ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమానికి మద్దతు ఇస్తోందని, క్షిపణుల తయారీకి ఉపయోగపడే ద్వంద్వ వినియోగ పారిశ్రామిక భాగాలను అందిస్తోందని అమెరికా ప్రభుత్వం ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా-ఇరాన్ బంధంపై గల్ఫ్ దేశాల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమాసియాలో అమెరికా సైనిక స్థావరాలపై నిఘా పెట్టేందుకు చైనా తయారు చేసిన TEE-01B అనే శాటిలైట్‌ను ఇరాన్ ఉపయోగించుకుందని ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది. ఈ పరిణామం గల్ఫ్ దేశాల్లో తీవ్ర ఆందోళనలకు కారణమవుతోంది.
ఈ శాటిలైట్‌ను ఉపయోగించి పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ నిఘా పెట్టింది. మార్చి 13, 14, 15 తేదీల్లో సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ చిత్రాలను ఈ శాటిలైట్ గుర్తించింది. అదే సమయంలో జోర్డాన్‌లోని మువాఫక్ సల్తీ ఎయిర్ బేస్, బహ్రెయిన్‌లోని అమెరికా ఐదో ఫ్లీట్ హెడ్ క్వార్టర్స్ సమీప ప్రాంతాలు, ఇరాక్‌లోని ఎర్బిల్ ఎయిర్పోర్ట్ వద్ద కార్యకలాపాలను కూడా ట్రాక్ చేసినట్లు మీడియా కథనంలో పేర్కొంది. కువైట్‌లోని క్యాంప్ బ్యూహ్రింగ్, అలీ అల్ సేలం ఎయిర్ బేస్ వంటి అమెరికా సంబంధిత స్థావరాలు కూడా దీని నిఘా నీడలోనే ఉన్నాయి. అయితే, ఇరాన్‌కు ఎలాంటి సైనిక మద్దతు ఇవ్వడం లేదని చైనా విదేశాంగ శాఖ గత కొన్ని రోజులుగా ఖండిస్తూ వస్తోంది.











