Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

అంబర్ పేటలో విషాదం…వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి

హైదరాబాద్‌ లోని అంబర్ పేటలో ‍విషాద ఘటన చోటుచేసుకుంది. వీధి కుక్కల దాడిలో అభంశుభం తెలియని నాలుగేళ్ల చిన్నారి బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. బాలుడిపై వీధి కుక్కల దాడికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కుక్కల బారి నుంచి తప్పించుకునేందుకు ఆ బాలుడు చేసిన ప్రయత్నం అందరి హృదయాలను కలిచివేస్తోంది.

నిజామాబాద్‌ జిల్లా ఇందల్‌వాయి మండలంకు చెందిన గంగాధర్‌ అనే వ్యక్తి నాలుగేళ్ల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చాడు. అంబర్‌పేట ఎరుకుల బస్తీలో గంగాధర్‌ నివాసం ఉంటున్నాడు. అక్కడికి సమీపంలోని ‘ఛే’ నంబరు చౌరస్తాలో ఉన్న ఓ కారు సర్వీస్‌ సెంటర్‌లో గంగాధర్‌ వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

ఆదివారం (ఫిబ్రవరి 19) సెలవు కావడంతో గంగాధర్‌ తన కూతురు, కుమారుడిని తీసుకుని తాను పని చేస్తున్న సర్వీస్‌ సెంటర్‌‌కు వెళ్ళాడు. కుమార్తెను పార్కింగ్‌ వద్ద ఉన్న క్యాబిన్‌లో ఉంచి.. కుమారుడిని మాత్రం సర్వీస్‌ సెంటర్‌ లోపలికి తీసుకెళ్లాడు. కుమారుడు ప్రదీప్‌ సర్వీస్‌ సెంటర్‌ లోపల ఆడుకుంటుండగా.. మరో వాచ్‌మన్‌తో కలిసి గంగాధర్‌ పని మీద బయటకు వచ్చాడు. కాసేపటి తర్వాత ప్రదీప్‌ తన అక్క కోసం క్యాబిన్‌ వైపు నడుచుకుంటూ వచ్చాడు. అక్కడే ఉన్న 4-5 వీధి కుక్కలు చిన్నారి ప్రదీప్‌ వెంటపడ్డాయి. దాంతో బాలుడు భయపడి పరుగులు తీశాడు.

కాస్త దూరంగా వెళ్లినట్టు వెళ్లిన వీధి కుక్కలు మరలా వచ్చి ప్రదీప్‌ వెంటపడ్డాయి. ఒకదాని తర్వాత మరొకటి అతడిపై దాడి చేశాయి. ఓ కుక్క కాలును.. మరో కుక్క చేయిని నోట కరచుకొని రెండు వైపులా లాగడంతో ప్రదీప్ తీవ్రంగా గాయపడ్డాడు. కుక్కల దాటికి తట్టుకోలేని బాలుడు గట్టిగా కేకలు వేశాడు. తమ్ముడి కేకలు విన్న అక్క.. పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి కుక్కలు వేటాడుతున్న దృశ్యం ఆమె కంట పడింది. పరుగున వెళ్లి తన తండ్రికి చెప్పగా.. ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి కుక్కలను తరిమికొట్టాడు. అప్పటికే తీవ్ర గాయాల పాలైన చిన్నారిని తండ్రి ఆస్పత్రికి తీసుకెళ్లగా.. బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దాంతో గంగాధర్‌ కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

RSS
Follow by Email
Latest news