ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి ‘టెర్రరిస్టు’ అంటూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలను ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణించింది. 24 గంటల లోగా వివరణ ఇవ్వాలని ఆయనకు నోటీసు జారీ చేసింది. తమిళనాడు ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ పొత్తుపై ఖర్గే విమర్శలు గుప్పించారు. తమిళనాట ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ, ఆ పార్టీ మోదీతో ఎలా చేతులు కలిపిందని ప్రశ్నించారు. ఆయనకు సమానత్వం, న్యాయంపై నమ్మకం లేవన్నారు. అలాంటి వాళ్లతో అన్నాడీఎంకే కలవడమంటే ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడమేనని ఖర్గే విమర్శించారు
ఖర్గే చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించేలా ఉన్నాయని ఆయనపై చర్య తీసుకోవాలని బీజేపీ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం బుధవారం ఉదయం ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఖర్గే వివరణ కోరుతూ ఎన్నికల కమిషన్ నోటీసు ఇచ్చింది. ప్రధానమంత్రిని ఉగ్రవాదిగా పేర్కొనడం యావద్దేశాన్ని అవమానించడమేనని బీజేపీ ప్రతినిధుల బృందం నిర్మలా సీతారామన్, కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు.
ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడంతో పాటు భారతీయ న్యాయసంహిత (బీఎన్ఎస్)లోని సెక్షన్ 175 కింద నేరమవుతుందని, పరువునష్టం కేసు వేసేందుకు అవసరమైన ప్రాథమిక సాక్ష్యంగా ఆయన వ్యాఖ్యలు నిలుస్తాయని ఈసీ దృష్టికి తెచ్చారు. ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించడంతో ఆయన తిరిగి వివరణ ఇచ్చారు. మోదీని తాను ఎప్పుడూ ఉగ్రవాది అని అనలేదని, ప్రజలు, రాజకీయ పార్టీలను ఆయన భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పడమే తన ఉద్దేశమని వివరణ ఇచ్చారు. తాజాగా, ఈసీ నోటీసు ఇవ్వడంతో గురువారం సాయంత్రంలోగా ఈసీకి ఆయన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.











