ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలు ఉన్నాయి. ఉదయం ప్రారంభమైన ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. బీజేపీ 48 స్థానాలతో చారిత్రక విజయం సాధించింది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాలకే పరిమితమైంది. మరోవైపు, కాంగ్రెస్ పార్టీపై ఢిల్లీ ఓటర్లు ఏమాత్రం కరుణ చూపలేదు. సుదీర్ఘ చరిత్ర ఉన్న హస్తం పార్టీకి ఈ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు కూడా రాలేదు. అయితే ఎన్నికల కౌంటింగ్ ముగిసే సమయానికి బీజేపీ 47 స్థానాలు కైవసం చేసుకోగా, ఓ స్థానంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ విజయంతో 27 ఏళ్ల తర్వాత బీజేపీ మళ్లీ ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకుంది .
ఈ విజయంతో ప్రధాని మోదీ సహా బీజేపీ అగ్రనేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు . ఈ నెల 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా… నేడు (ఫిబ్రవరి 8) ఓట్ల లెక్కింపు చేపట్టారు. బీజేపీ తిరుగులేని విజయం సాధించిన క్రమంలో… ఢిల్లీ కొత్త సీఎం ఎవరన్నది అత్యంత ఆసక్తికరంగా మారింది.
మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఓడించిన పర్వేశ్ వర్మ నే ఢిల్లీ సీఎం అంటూ ప్రచారం జరుగుతోంది. న్యూఢిల్లీ నియోజకవర్గం ఫలితం వెలువడిన వెంటనే పర్వేశ్ వర్మను కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలిపించుకుని ప్రత్యేకంగా మాట్లాడారు. దాంతో, పర్వేశ్ వర్మ తదుపరి సీఎం అంటూ మరింత జోరుగా కథనాలు వచ్చాయి. అయితే, బీజేపీ ఢిల్లీ వ్యవహారాల ఇన్చార్జి బైజయంత్ పాండా మాత్రం… సీఎం ఎవరన్నది బీజేపీ హైకమాండ్ చూసుకుంటుందని, దీనిపై ఊహాగానాలు వద్దని సూచించారు.