ఓ ప్రముఖ సంస్థ ఏపీలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. వారీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుంది. త్వరలోనే ఆ సంస్థ తన కార్యకలాపాలను మొదలుపెట్టనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 3,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ పరిశ్రమ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 300 ఎకరాల భూమిని కేటాయించింది. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో ఈ ఫ్యాక్టరీని నెలకొల్పనుంది. మొత్తం రూ.8,175 కోట్ల భారీ పెట్టుబడితో లిథియం అయాన్ బ్యాటరీల తయారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. మొదటి దశ పనులను 2027 జులై నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. మొత్తం 16 గిగావాట్ అవర్ సామర్థ్యంతో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
ఈ ఫ్యాక్టరీలో సెల్, ప్యాక్, స్టోరేజ్‌కు అవసరమైన బ్యాటరీలను తయారు చేస్తారు. భవిష్యత్తులో ఈ ప్లాంట్‌ను మరింత విస్తరించాలని వారీ సంస్థ ప్రణాళికలు రచిస్తోంది. అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్ (ఏసీసీ) లిథియం అయాన్ సెల్స్, బ్యాటరీ ప్యాక్‌ల తయారీ సామర్థ్యాన్ని 20 గిగావాట్ అవర్ వరకు పెంచాలని భావిస్తోంది. ఈ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్న సంస్థకు గుజరాత్, అమెరికాలోని టెక్సాస్‌లో సోలార్ మాడ్యూల్స్ తయారీ యూనిట్లు ఉన్నాయి. సుమారు 30 దేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తూ అంతర్జాతీయంగా మంచి గుర్తింపు పొందింది. దేశంలోనే ఇటువంటి ప్రాజెక్టులు పరిమితంగా ఉన్న నేపథ్యంలో అనకాపల్లి జిల్లా పారిశ్రామిక చిత్రపటంలో ఈ ఫ్యాక్టరీ కీలకపాత్ర పోషించనుంది.











