Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

డీలిమిటేషన్‌పై అమిత్ షా కీలక ప్రకటన… ఏపీకి 38, తెలంగాణకు 26 ఎంపీ సీట్లు

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డీలిమిటేషన్ (లోక్‌సభ స్థానాల పునర్విభజన) ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాలు వ్యక్తం చేస్తున్నవిషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం లోక్‌సభలో కీలక ప్రకటన చేశారు. డీలిమిటేషన్ లో దక్షిణాది రాష్ట్రాల లోక్‌సభ సీట్లు తగ్గవని స్పష్టం చేశారు. సంఖ్యాపరంగా, నిష్పత్తి పరంగా కూడా పెరుగుతాయని ఆయన స్పష్టం చేశారు.

లోక్‌సభ మొత్తం సీట్ల సంఖ్యను పెంచిన తర్వాత దక్షిణాది రాష్ట్రాల సీట్లు కూడా పెరుగుతాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ స్థానాలు 25 నుంచి 38కి, తెలంగాణలో 17 నుంచి 26కి, కర్ణాటకలో 28 నుంచి 42కి, తమిళనాడులో 39 నుంచి 59కి, కేరళలో 20 నుంచి 30కి సీట్లు పెరుగుతాయని అమిత్ షా వివరించారు. ప్రస్తుతం 543 సీట్లున్న లోక్‌సభలో ఐదు దక్షిణాది రాష్ట్రాలకు 129 స్థానాలు (23.76 శాతం) ఉండగా, సభ విస్తరణ తర్వాత 195 స్థానాలకు (సుమారు 23.97 శాతం) పెరుగుతాయని పేర్కొన్నారు.

లోక్‌సభ సీట్ల సంఖ్యను దాదాపు 816 నుంచి 850కి పెంచి, మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు ఆమోదింపజేసి, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. అయితే, జనాభా ప్రాతిపదికన సీట్ల పునర్విభజన చేపడితే, జనాభా నియంత్రణను సమర్థంగా అమలు చేసిన తమకు అన్యాయం జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనివల్ల పార్లమెంటులో తమ ప్రాతినిధ్యం, ప్రాధాన్యత తగ్గుతుందని వాదిస్తున్నాయి.

మరోవైపు, ఈ బిల్లును ప్రస్తుత రూపంలో ఆమోదిస్తే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తెలిపారు. మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం మాట్లాడుతూ, తొలుత సీట్లు పెరిగినట్లు కనిపించినా, భవిష్యత్తులో జరిగే డీలిమిటేషన్ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాల వాటా తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దక్షిణాది రాష్ట్రాలన్నీ ఏకతాటిపైకి రావాలని, జనాభాతో పాటు రాష్ట్రాల స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) వంటి ఆర్థిక సూచికలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని అయన సూచించారు.

ప్రస్తుతానికి ఏ రాష్ట్రానికీ నష్టం జరగదని, అన్ని రాష్ట్రాల సీట్లు పెరుగుతాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ చర్చల నేపథ్యంలో, దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.

RSS
Follow by Email
Latest news