రాష్ట్రంలో రైతుల పరిస్థితి దిగజారిపోయిందని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ప్రభుత్వానికి ధాన్యం కొనడం చేత కావట్లేదని విమర్శించారు. పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా కార్యకర్తల సమావేశం తెలంగాణ భవన్లో నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు. తెలంగాణ గురించి ఎంపీ తేజస్వి సూర్య ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్, భాజపా ఎంపీలు ఒక్కమాట మాట్లాడలేదు. బీఆర్ఎస్ ఎంపీలు లోక్‌సభలో ఉండి ఉంటే రణరంగం సృష్టించేవాళ్లు. కాళేశ్వరంపై రాజ్యసభలో సీఆర్ పాటిల్ మాట్లాడితే సురేశ్‌రెడ్డి గట్టిగా ఖండించారు. తెలంగాణ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కాంగ్రెస్, భాజపా నేతలు ఏం చేస్తున్నారు?’’ అని ప్రశ్నించారు.
‘‘రాష్ట్ర విభజన సమయంలో.. హైదరాబాద్ విషయంలో రాజీ పడాలని సోనియా గాంధీ ఎన్నో సార్లు చెప్పారు. కానీ.. నేను ఎప్పుడూ రాజీ పడలేదు.. అది నా చిత్తశుద్ధి’’ అని కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను రద్దు చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కీలక బాధ్యతలను కేసీఆర్ అప్పగించారు. త్వరలో అన్ని స్థాయిల కమిటీలను నియమించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే కొత్త కమిటీలకు శిక్షణా తరగతులు నిర్వహించే బాధ్యతలను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అప్పగించారు.











