Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

తెలంగాణలో ఆవిర్భవించనున్న మరో కొత్త పార్టీ

తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త అధ్యాయానికి తెరలేవనుంది. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సొంత రాజకీయ పార్టీని స్థాపించబోతున్నారు. ‘తెలంగాణ ప్రజా జాగృతి’ (టీపీజే) పేరుతో శనివారం తన కొత్త పార్టీని అధికారికంగా ప్రకటించనున్నారు. ఇందుకోసం మేడ్చల్ సమీపంలోని మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్‌లో భారీ ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణంలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహంతోపాటు బీఆర్‌ అంబేడ్కర్, జ్యోతిరావు ఫులే, ఆచార్య జయశంకర్‌ విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు.

బంజారాహిల్స్‌లోని తన నివాసం నుంచి ఉదయం 7:30 గంటలకు భారీ ర్యాలీగా బయలుదేరి, గన్‌పార్క్ వద్దకు చేరుకొని  అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించనున్నారు. అనంతరం మేడ్చల్‌లోని సభా ప్రాంగణానికి బయలుదేరుతారు.  ఉదయం 10 గంటలకు అక్కడకు చేరుకొని పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. పార్టీ జెండాను పసుపు, ఆకుపచ్చ, నీలం రంగులతో  రూపొందించినట్లు సమాచారం. పసుపు శుభసూచకంగా, ఆకుపచ్చ రైతులు, వ్యవసాయ రంగానికి చిహ్నంగా, నీలం బడుగు బలహీన వర్గాల కోసం పోరాటానికి సంకేతంగా ఈ రంగులను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

ఈ కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఉద్యమకారులు, మేధావులతో పాటు 33 జిల్లాల నుంచి దాదాపు 50 వేల మంది కార్యకర్తలు, మద్దతుదారులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. సభకు విచ్చేస్తున్న అతిథుల కోసం తలకాయ కూర, నాటుకోడి పులుసు, జొన్న రొట్టెలతోపాటు మొత్తం 34 రకాల తెలంగాణ వంటకాలతో భారీ భోజన ఏర్పాట్లు  చేశారు. సభా ప్రాంగణానికి ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టగా, స్వాగత ద్వారాలకు కాళోజీ, రాణి రుద్రమదేవి వంటి తెలంగాణ ప్రముఖుల పేర్లను పెట్టారు. ఈ సందర్భంగా సుమారు గంటన్నర పాటు ప్రసంగించి, పార్టీ విధివిధానాలను, భవిష్యత్ కార్యాచరణను ప్రజలకు వివరించనున్నారు.

RSS
Follow by Email
Latest news