ఆమ్ ఆద్మీ పార్టీకి (ఆప్) రాజ్యసభలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ రాఘవ్ చద్దాతో పాటు ప్రముఖ క్రికెటర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, అశోక్ మిట్టల్ వంటి ముఖ్య నేతలు కూడా పార్టీ మారడంపై ఢిల్లీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
రాఘవ్ చద్దా శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ…. ఆమ్ ఆద్మీ పార్టీలోని పది మంది రాజ్యసభ సభ్యుల్లో ఏడుగురు సభ్యులం బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. “రాజ్యాంగంలోని నిబంధనలకు అనుగుణంగా, రాజ్యసభలోని ఆప్ సభ్యుల్లో మూడింట రెండొంతుల మంది బీజేపీలో విలీనం కావాలని నిర్ణయించుకున్నామని ఆయన స్పష్టం చేశారు. ఆప్ ఎంపీలు రాఘవ్ చద్దా తో కలిసి అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. తమ వర్గం బీజేపీలో విలీనం అవుతున్నట్లు అధికారికంగా వెల్లడించారు.
కాగా, ఈ పరిణామంతో రాజ్యసభలో ప్రస్తుతం బీజేపీ 106 మంది సభ్యులతో పెద్దల సభలో అతిపెద్ద పార్టీగా కొనసాగుతోంది. తాజాగా ఆప్ నుంచి ఏడుగురు ఎంపీల చేరికతో బీజేపీ బలం మరింత పెరగనుంది. ఇప్పుడు బీజేపీ బలం 113కి పెరగనుంది. అంతేకాదు, మిత్రపక్షాలతో కలిపి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి బలం రాజ్యసభలో 125కి చేరుతుంది. కొన్ని రోజుల క్రితమే రాఘవ్ చద్దాను రాజ్యసభలో పార్టీ డిప్యూటీ లీడర్ పదవి నుంచి ఆప్ అధిష్ఠానం తొలగించింది. ఆయన స్థానంలో అశోక్ మిట్టల్‌ను నియమించింది. అయితే, ఇప్పుడు చద్దాతో పాటు ఆ కొత్త డిప్యూటీ లీడర్ అశోక్ మిట్టల్ కూడా బీజేపీలో చేరనుండడం గమనార్హం.











