తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. దీంతో బస్ డిపోల్లో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. డిపోల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సమ్మెతో రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు చోట్ల ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు.

కాగా.. ప్రయాణికుల కోసం కాంటాక్ట్ ఉద్యోగులతో బస్సులను నడిపేందుకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేశారు. అయితే ఆ బస్సులను నడవనీయకుండా ఉద్యోగులు రోడ్లపై బైఠాయించి బస్సులను అడ్డుకుంటున్నారు. అందులో డ్రైవర్, కండక్టర్ లను క్రిందకి దించేస్తున్నారు. సమ్మె కాలంలో ప్రయాణికులు తమ ప్రయాణాలు మానుకోవాలని సూచిస్తున్నారు.

తాము గొంతెమ్మ కోరికలు కోరుకోవడంలేదని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో పెట్టిన వాటినే అమలు చేయమని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయకులూ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కార్మికుల సమ్మెపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కొన్ని సంఘాలు నిజాలను విస్మరించి కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నాయని పేర్కొన్నారు.











