విడుదల తేదీ : ఏప్రిల్ 17, 2026
నటీనటులు : సాయి తేజ్, వేద జలంధర్, ప్రదీప్ కొట్టే, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేష్, సత్యనారాయణ తదితరులు.
దర్శకుడు : వి.మునిరాజు
నిర్మాతలు : కిరణ్ అబ్బవరం, తేజ వేల్పుచర్ల.
సంగీతం : వంశీకాంత్ రేఖన
ఛాయాగ్రహణం : అక్షయ్ రామ్ పొదిశెట్టి
ఎడిటింగ్ : వి.మునిరాజు
కథానాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం, నూతన ప్రతిభను ప్రోత్సహిస్తూ నిర్మాతగా ఆయన నిర్మించిన చిత్రం ‘తిమ్మరాజుపల్లి టీవీ’. దాదాపుగా 40 మంది నూతన నటీనటులను పరిచయం చేస్తూ, ముని అనే కొత్త దర్శకుడితో రూపొందిన ఈ చిత్రం ప్రచార చిత్రాలతో మంచి క్రేజ్‌ను తెచ్చుకుంది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం కథేంటి? ‘తిమ్మరాజుపల్లి టీవీ’ చిత్రంలో ప్రేక్షకులను అలరించే అంశాలున్నాయా? లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథ :
1990 కాలంలో ఇంట్లో టీవీ ఉంటేనే గొప్ప అనుకొనే రోజుల్లో ని కథ. శివరాత్రి వచ్చిందంటే ఊరంతా చందాలు వేసుకొని, టీవీ.. క్యాసెట్లు అద్దెకు తెచ్చుకొని, ఆ సినిమాలు చూస్తూ రాత్రంతా జాగారం చేసే రోజులు. ఆ ఊర్లోని సతీష్ (సాయి తేజ్) హుషారైన కుర్రాడు. చిన్న చిన్న దొంగతనాలు కూడా చేస్తుంటాడు. అదే ఊర్లోని శారద (వేదా జలంధర్)ని ప్రేమిస్తాడు. ఐతే, శివరాత్రి రోజు సతీష్ ఓ టీవీ రెంట్ కి తెస్తాడు. దానిలో సినిమా చూడటానికి ఊరు జనమంతా వస్తారు. మరోవైపు ఆ ఊర్లోకి ఫస్టు టీవీ ఎవరి ఇంటికి వస్తుందన్న విషయంలో రాజప్ప (ప్రదీప్ కొట్టే), రామచంద్రయ్య (అమ్మ రమేష్) మధ్య పోటీ నడుస్తుంటుంది. ఓరోజున రాజప్పే టీవీ కొనేస్తాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో రాజప్ప ఇంట్లో టీవీని దొంగలు ఎత్తుకెళ్తారు. ఆ దొంగతనానికి సతీష్ కి ఉన్న కనెక్షన్ ఏమిటి ?, చివరకు ఆ టీవీ దొరికిందా? లేదా ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమా కథ 1990 బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. 1980, 1990 జనరేషన్ వాళ్లకు టీవీ ఓ ఎమోషన్…శుక్రవారం వచ్చిదంటే చిత్రలహరి, శని, ఆదివారాలు సినిమాలు, ఋతురాగాలు, అన్వేషిత, శక్తిమాన్… ఇలాంటి కార్యక్రమాలతో ఎన్నో అనుబంధాలున్నాయి. అలాగే, సిడి, వీసీడీ క్యాసెట్లు తెచ్చుకొని చూడడం ఓ అరుదైన లగ్జరీ. ఆకాలంలో నరాల్లోనివారు, పల్లెటూరి వాళ్లు అనే తేడా ఉండేది కాదు. సాయంత్రం అయ్యిందంటే చాలు రాత్రి 10 గంటల వరకు టీవీల ముందు కూర్చునే రోజులు.

ఆనాటి టీవీ ముచ్చట్లన్నీ ఈ సినిమా చూస్తున్నప్పుడు తెరలు తెరలుగా, కథలు కథలుగా కళ్లముందు మెదులుతాయి. ఆ జనరేషన్ వాళ్లు సినిమా మొదలైన కాసేపటికే ఎంగేజ్ అయిపోతారు. హీరోహీరోయిన్ల మధ్య నడిచే ప్రేమ కథ బాగానే సాగింది. సరిగ్గా ‘తిమ్మరాజుపల్లి టీవీ’ సినిమాలో అందరికి ఇవే జ్క్షాపకాలను గుర్తు చేస్తూ తన నిజ జీవితంలో జరిగిన సంఘటనలతో ఓ కథను దర్శకుడు వి.మునిరాజు అల్లుకున్నాడు. ముఖ్యంగా 1990 లో ప్రజలు ఎలా ఉండేవాళ్ళు, టీవీ చూడటానికి ఎంత ఆసక్తి చూపించేవాళ్ళో తమ నటనతో అందరూ చాలా బాగా నటించారు. అలాగే ఈ కథ ముగింపులో వచ్చే ట్విస్ట్ కూడా సినిమాకి ప్లస్ అయింది.
మైనస్ పాయింట్స్ :
కీలకమైన సన్నివేశాలను బాగా రాసుకున్నప్పటికీ.. మిగిలిన సన్నివేశాల్లో ప్రధానంగా సెకండ్ హాఫ్ మధ్యలో వచ్చే కొన్ని సీన్స్ ను ఇంకా ఆసక్తికరంగా మలిచి ఉంటే బాగుండేది. టీవీని ఎవరు దొంగిలించారు అనే పాయింట్ చుట్టూ కథను సాగదీయడంతో సినిమాలో కొన్ని చోట్ల బోర్ ఫీలింగ్ వచ్చేస్తుంది.
సాంకేతిక విభాగం :
మంచి కథా నేపధ్యాన్ని తీసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు వి.మునిరాజు, కొన్ని చోట్ల ఉత్కంఠభరితమైన సీన్స్ ను రాసుకోవడంలో మాత్రం తడబడ్డాడు. కానీ, ఆయన రూపొందించిన సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. సంగీత దర్శకుడికి ఇదే తొలి సినిమా అయినా సంగీతం బాగా అందించాడు. కెమెరామెన్ పల్లెటూరి వాతావరణంను ప్రతీ ఫ్రేములోనూ తీసుకు రావడం సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఎడిటింగ్ కూడా బాగుంది. నిర్మాతలు కిరణ్ అబ్బవరం, తేజ వేల్పుచర్ల ఖర్చుకు వెనకాడకుండా నిర్మాణ విలువులు పాటించారు.
తీర్పు :
ఈ సినిమాలో హీరో సాయి తేజ్ బాగా నటించాడు. హీరోయిన్ గా వేద జలంధర్ నటన కూడా బాగుంది. స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేష్, సత్యనారాయణలతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల్లో మెప్పించారు. కమర్షియల్ సక్సెస్ గురించి పక్కన పెడితే…. ఈ సినిమా ముఖ్యంగా కథ, అప్పటి టీవీ నేపథ్య సన్నివేశాలు, పల్లెటూరి వాతావరణంలో ఆద్యంతం ఆహ్లాదభరితంగా, సహజమైన నటీనటులతో రూపొందిన ‘తిమ్మరాజుపల్లి టీవీ’ సినిమా చూసిన ప్రేక్షకులు ఓ మంచి ప్రయత్నం అని మాత్రం అభినందిస్తారు.
apts breaking news.com rating : 3/5
రివ్యూ : బన్న ప్రభాకర్
గమనిక :- ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!











