పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ సినిమా డిజిటల్ ప్లాట్ ఫామ్ హక్కులను సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ నేడు (ఏప్రిల్ 16, 2026) నుండి నెట్‌ఫ్లిక్స్ లో ప్రదర్శించబడుతుంది. భారీ అంచనాల మధ్య మార్చి 19, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.
థియేటర్లలో మిశ్రమ ఫలితాన్ని అందుకున్న ఈ సినిమా, డిజిటల్ వేదికపై ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి మరి. ‘గబ్బర్ సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వచ్చిన పవన్-హరీష్ శంకర్ కాంబో కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కానీ, కలెక్షన్ల పరంగా ఈ సినిమా రూ. 100 కోట్ల మార్కును కూడా దాటలేక ‘డిజాస్టర్’గా నిలిచింది. దీంతో త్వరగానే ఓటీటీ బాట పట్టింది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు (ఒరిజినల్), తమిళం, హిందీ, కన్నడ, మలయాళం ఐదు భాషల్లో ఓటీటీలో అందుబాటులోకి రావడం విశేషం.











