ఇరాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హర్మూజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్‌కు మరో రెండు వారాలు గడువు ఇచ్చారు. ఈ రెండు వారాలపాటు కాల్పుల విరమణను అయన ప్రకటిస్తున్నట్లు ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ట్రంప్ వెల్లడించారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రతిపాదన మేరకు ట్రంప్ అంగీకరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అయన ప్రకటించారు. ఇరుదేశాల వైపు నుంచి ఈ కాల్పుల విరమణ ఉంటుందని అన్నారు.
ఇరాన్‌కు ఇచ్చిన గడువును రెండు వారాలపాటు పొడిగించాలని, దాడులను నిలిపివేయాలని ‘‘పాక్ ప్రధాని షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ కోరారు. హర్మూజ్ జలసంధిని తెరవాలనే షరతుకు లోబడి రెండు వారాల గడువు ఇచ్చేందుకు, కాల్పుల విరమణకు అంగీకరించాను అని ట్రంప్ అన్నారు. ఇరాన్ పది సూత్రాలతో ఒక ప్రతిపాదనను పంపించింది. అవన్నీ సానుకూలంగానే ఉన్నాయి. దీంతో చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. ఇరాన్‌తో శాశ్వత శాంతి ఒప్పందానికి, పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పడానికి ఈ రెండు వారాల గడువు అత్యంత కీలకం కానుంది.
అమెరికా అంగీకరించిన రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరాన్ సమ్మతించింది. పాక్ ప్రధాని అభ్యర్థన మేరకు అమెరికాతో చర్చలకు అంగీకరిస్తున్నామని ఇరాన్ వెల్లడించింది. అయితే, సాయుధ దళాల పర్యవేక్షణలో ఈ రెండు వారాలపాటు హర్మూజ్‌లో రాకపోకలు సాగుతాయని తెలిపింది. ఈ విరామం కేవలం దౌత్యపరమైన చర్చల కోసమేనని, యుద్ధం శాశ్వతంగా ముగిసినట్లు కాదని ఇరాన్ స్పష్టం చేసింది. సోదరభావంతో యుద్ధం ముగింపునకు కృషి చేస్తున్న పాక్‌కు ఇరాన్ ప్రభుత్వం కృతజ్ఞతలు తెలిపింది.











