కెసిఆర్ ముద్దుల కూతురు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. నూతన పార్టీ ఏర్పాటు విషయంలో ఆమె వేగం పెంచారు. ఏప్రిల్ 25న పార్టీని ప్రారంభించనున్నట్లు గతంలోనే ఆమె ప్రకటించింది. తాను ఏర్పాటు చేయనున్న పార్టీ పేరును ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ (టీఆర్ఎస్) పేరును పరిశీలిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీ, ‘భారత రాష్ట్ర సమితి’ (బీఆర్ఎస్)గా మారడంతో ప్రస్తుతం టీఆర్ఎస్ పేరు ఎవరైనా వాడుకోవచ్చని కవిత వ్యాఖ్యానించారు.
పాత పేరు, కొత్త జెండా, అజెండాతో ప్రజల ముందుకు వస్తానని అన్నారు. అయితే పార్టీ పేరు టీఆర్ఎస్ అయినా జెండాలో మాత్రం గులాబీ రంగు ఉండదని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్‌తో పాటు టీఆర్ఎస్ పేరుతో ముడిపడిన భావోద్వేగాలను తనవైపు తిప్పుకోవాలనేది ఆమె వ్యూహంగా కనిపిస్తోంది. దీంతో తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్న పేరును కవిత సొంతం చేసుకోబోతున్నారా? అనే ఉత్కంఠ నెలకొంది. అంతేకాకుండా ఈమె చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
తమ పార్టీ ప్రొఫెసర్ జయశంకర్ సిద్ధాంతాల పునాదిపై నడుస్తుందని, ‘బిహార్ సిద్ధాంతాలకు’ తమ పార్టీలో చోటుండదని స్పష్టం చేశారు. తమకు ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీ అని కవిత ప్రకటించారు. అదే సమయంలో బీఆర్ఎస్ను ‘ధనిక పార్టీ’గా ఆమె అభివర్ణించారు. పార్టీ రిజిస్ట్రేషన్ కోసం తెలంగాణ జాగృతి బృందం ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ‘తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ’ పేరుతో ప్రక్రియ ప్రారంభించింది.
పార్టీ ఆవిర్భావం రోజున అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి, ఉద్యమకారులతో కలిసి వేదికను పంచుకుంటామని అన్నారు. రానున్న ఎన్నికల్లో సిద్దిపేట లేదా గజ్వేల్‌లో మహిళా రిజర్వేషన్లు అమలైతే అక్కడి నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని కవిత సూచనప్రాయంగా తెలిపారు. డీఎస్పీ విశారదన్ మహరాజ్‌తో కలిసి పనిచేస్తామని కవిత వెల్లడించారు.











