ప్రస్తుతం ఇరాన్‌తో అమెరికా యుద్ధం కొనసాగుతున్న ఈ తరుణంలో అమెరికాకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశానికి చెందిన అత్యాధునిక ఎఫ్-15 యుద్ధవిమానాన్ని ఇరాన్ కూల్చివేసింది. శకలాలను ట్రక్కులో తరలిస్తున్న దృశ్యాలను ప్రభుత్వ అనుబంధ వార్తా ఛానల్ ఒకటి ప్రసారం చేసింది. ఇరాన్ భూభాగంలో అమెరికా యుద్ధవిమానాన్ని కోల్పోవడం ఇదే తొలిసారి. ఆ సమయంలో అందులో ఇద్దరు పైలట్లు ఉన్నారు. అయితే ఆసమయంలో వారిద్దరూ బయటకు దూకేశారని టెహ్రాన్ తెలిపింది. వారి ఆచూకీ తెలిపినవారికి భారీ పారితోషికం ఇస్తామని తమ దేశ ప్రజలను కోరింది.
అయితే ఇరాన్లో కూలిపోయింది ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగల్ యుద్ధవిమానమని అమెరికా వర్గాలు వెల్లడించాయి. అందులోని ఇద్దరు పైలట్లలో ఒకరిని రక్షించామని, మరొకరి కోసం గాలింపు కొనసాగుతోందని అమెరికా, ఇజ్రాయెల్ అధికారవర్గాలు తెలిపాయి. ఈ వివరాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు తెలియజేసినట్లు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తెలిపారు. అయితే ఇద్దరు పైలట్లను కాపాడేందుకు అమెరికా వెంటనే ఓ హెలికాప్టర్ ను రంగంలోకి దింపింది. గాలింపు చర్యల్లో పాల్గొంటున్న ఆ హెలికాప్టర్‌ను కూడా తాము కూల్చివేశామని ఇరాన్ ప్రకటించింది.
అంతేకాకుండా….. కువైట్‌లోని ఓ ప్రధాన చమురు శుద్ధి కర్మాగారంపై ఇరాన్ దాడి చేసింది. దాంతో ఆ కర్మాగారంలో భారీగా మంటలు చెలరేగాయి. యూఏఈ రాజధాని అబుధాబీపైకి టెహ్రాన్ ప్రయోగించిన క్షిపణుల శకలాలు తగిలి ఐదుగురు భారతీయులు గాయపడ్డారు. ఇరాన్ లోని టెహ్రాన్ నగరాన్ని కారజ్ నగరంతో అనుసంధానించేందుకు నిర్మిస్తున్న భారీ వంతెనను అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దలాలు ధ్వంసం చేశాయి. పశ్చిమాసియాలో కెల్లా ఎత్తైన వంతెనగా దీనికి పేరుంది.
ఇరాన్ పై మరింత భీకర దాడులు : ట్రంప్
ఇరాన్లో ఇప్పుడిక అసలైన విధ్వంసం మొదలవుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. అంతకంటే ముందే ఇరాన్ తమతో ఒప్పందానికి రావాలని సూచించారు. లేదంటే వచ్చే 2-3 వారాల్లో ఆ దేశంపై మరింత భీకర దాడులు చేస్తామని ‘ట్రూత్ సోషల్’లో హెచ్చరించారు. ఇరాన్లో వంతెనలు, విద్యుత్ కర్మాగారాలను లక్ష్యంగా పేల్చేస్తామని అయన హెచ్చరికలు జారీ చేశారు.











