హైదరాబాద్‌లోని పలు సింగిల్ స్క్రీన్ థియేటర్లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. అద్దె విధానానికి స్వస్తి పలికి, మల్టీప్లెక్స్‌ల తరహాలో పర్సెంటేజీ విధానంలో సినిమాలను ప్రదర్శించాలని నిర్ణయించాయి. నగరంలోని మొత్తం 23 థియేటర్లలో శుక్రవారం నుంచి కొత్త విధానం అమల్లోకి వచ్చినట్లు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఓ ప్రకటనలో తెలిపింది.
థియేటర్ల నిర్వహణ ఖర్చులు, పెరిగిన సిబ్బంది జీతాలతో ఈ విధానం భారంగా మారిందని, థియేటర్ల మనుగడ కష్టమవుతోందని యాజమాన్యాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే పర్సెంటేజీ విధానంలోకి మారాలని నిర్ణయించాయి. ఇంతకాలం సినిమా ప్రదర్శన కోసం పంపిణీదారులు థియేటర్ల యాజమాన్యాలకు రోజువారీగా లేదా వారానికి ఇంత అని అద్దె చెల్లించేవారు.
పర్సెంటేజీ ఎలా :
కానీ ఈ కొత్త విధానం ప్రకారం, సినిమా విడుదలైన మొదటి వారం వసూళ్లలో 60 శాతం, రెండో వారం 50 శాతం, మూడో వారం 40 శాతం చొప్పున వాటాను డిస్ట్రిబ్యూటర్లకు ఇవ్వనున్నారు. మిగిలిన వాటాను థియేటర్ యజమానులు తీసుకుంటారు.
ప్రస్తుతం నగరంలోని 23 థియేటర్లతో ప్రారంభమైన ఈ విధానాన్ని, భవిష్యత్తులో దశలవారీగా తెలంగాణలోని అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లకు విస్తరించనున్నట్లు థియేటర్ల యాజమాన్యాలు తెలిపినట్టు ఫిల్మ్ ఛాంబర్ తన ప్రకటనలో పేర్కొంది.











