ఈ కొత్త ఆర్థిక సంవత్సరం బ్యాంకింగ్ నిబంధనల్లో మార్పులు చేయనున్నారు. బుధవారం నుంచి 2026-27 ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో… రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తో పాటు, పలు బ్యాంకులు తమ ఖాతాదారుల లావాదేవీల విషయంలో కొన్ని సవరణలు చేయనున్నారు. ఏటీఎంలలో కార్డు లేకుండా, యూపీఐ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నగదు ఉపసంహరించుకునే వెసులుబాటును ఇప్పటివరకూ వినియోగదారులు ఉచితంగా వాడుకునే వారు.

కానీ ఈ కొత్త ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 1 నుంచి దీనికి బ్యాంకులు అడ్డుకట్ట వేయనున్నారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సహా పలు బ్యాంకులు ఇకపై ఏటీఎంలలో చేసే యూపీఐ ఆధారిత నగదు ఉపసంహరణలనూ, నెలవారీ ఉచిత ఏటీఎం లావాదేవీలుగానే పరిగణించనున్నాయి. ఉచిత లావాదేవీల పరిమితి ముగిశాక.. యూపీఐ ద్వారా చేసే ప్రతి ఉపసంహరణపైనా రూ.23తో పాటు అదనంగా పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ రోజువారీ ఏటీఎంలో నగదు ఉపసంహరణ పరిమితులను సగానికి తగ్గించింది. రోజువారీ నగదు ఉపసంహన పరిమితిని రూ.1,00,000 నుంచి రూ.50,000 వరకు తగ్గించింది. అలాగే బంధన్ బ్యాంక్ ఖాతాదారులు తమ సొంత ఏటీఎంలలో నగదు ఉపసంహరణ నెలకు 5 సార్లు ఉచిత. ఇతర బ్యాంకుల ఏటీఎంలను వాడితే మెట్రో నగరాల్లో 3 లావాదేవీలు మాత్రమే ఉచితం. అంతకంటే ఎక్కువసార్లు లావాదేవీలు చేసినట్లయితే, ప్రతి లావాదేవీకి రూ.10 రుసుము వాసులు చేస్తారు. యాప్ల ద్వారా పదేపదే బ్యాలెన్స్ చెక్ చేస్తే నామమాత్రపు ఛార్జీలుంటాయి.











