దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు రంజాన్ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈద్-ఉల్-ఫితర్ పండుగను భక్తి, ఆనందం, సోదరభావంతో ఘనంగా జరుపుకుంటున్నారు. రంజాన్ నెల ముగిసిన సందర్భంగా జరుపుకునే ఈ పండుగ ముస్లింలకు అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది. ఒక నెల పాటు రంజాన్ ఉపవాస దీక్షలు చేసిన అనంతరం, నెలవంక దర్శనంతో షవ్వాల్ మాసం ప్రారంభమవుతుంది. ఆ నెల మొదటి రోజున ఈద్ పండుగను జరుపుకుంటారు.
ఈద్-ఉల్-ఫితర్ ప్రాముఖ్యత
రంజాన్ మాసంలోనే పవిత్ర గ్రంథమైన ఖురాన్ అవతరించింది. అందుకే ఈ నెలను అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఉపవాసం ద్వారా ఆత్మశుద్ధి, నియమం, సహనం వంటి విలువలను అలవర్చుకుంటారు. రంజాన్ ముగిసిన సందర్భంగా జరుపుకునే ఈద్ పండుగ, ఆనందాన్ని పంచుకోవడం, సోదరభావాన్ని పెంపొందించడం అనే సందేశాన్ని ఇస్తుందని ఇస్లామిక్ విశ్వాసాల ప్రకారం తెలియపరుచుచున్నది.
ఈద్ అంటే ఏమిటి . ..?
ఈ పండుగను అల్లాకు కృతజ్ఞతలు తెలియజేయడానికి జరుపుకుంటారు. సూర్యోదయం నుంచి సుర్యాస్తమయం వరకు ఎలాంటి ఆహార , పానీయాలు తీసుకోకుండా, నోటిలోని లాలాజలం కూడా లోనికి తీసుకోకుండా కటిక ఉపవాసం చేస్తారు . ఇది ఒక నెల పాటు ఉపవాసం ఉండే శక్తిని ఇచ్చినందుకు, క్షమాపణలు పొందేందుకు, ఆశీర్వాదాలు కోరుకునేందుకు జరుపుకునే పండుగనే ఈద్ అంటారు.
ఈద్ ఎలా జరుపుకుంటారు?
పండుగ (ఈద్) రోజున తెల్లవారుజామున లేచి, స్నానం చేసి, కొత్త లేదా శుభ్రమైన బట్టలు ధరించి మసీదులకు లేదా ఈద్గాలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ప్రార్థనల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని “ఈద్ ముబారక్” అంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఇళ్లలో సేమియా, షీర్ ఖుర్మా వంటి తీపి వంటకాలను తయారు చేసి బంధువులు, స్నేహితులతో పంచుకుంటారు. పిల్లలకు, కుటుంబ సభ్యులకు “ఈదీ”గా బహుమతులు ఇస్తారు.
దానధర్మాల ప్రాముఖ్యత
ఈ పండుగ సందర్బంగా ముస్లిం సోదరులు చేసే దానధర్మాలకు ప్రత్యేక స్థానం ఉంది. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం, పేదలకు ఆహారం, దుస్తులు దానం చేయడం అత్యంత పుణ్యకార్యంగా భావిస్తారు. దీనిని “జకాత్ అల్-ఫితర్”గా పిలుస్తారు. మొత్తానికి, ఈద్-ఉల్-ఫితర్ ప్రేమ, శాంతి, సోదరభావం మరియు ఆనందాన్ని పంచే మహత్తర పండుగ. సమాజంలో ఐక్యతను పెంపొందించే సందేశాన్ని ఈ పండుగ అందిస్తుంది.











