తెలంగాణ ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క 2026-27 ఏడాదికి రూ. 3.24 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ప్రభుత్వం తన ఎన్నికల వాగ్దానాలైన ఆరు గ్యారెంటీ పథకాల అమలుకు ఈ బడ్జెట్లో అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. వీటి కోసం ఏకంగా రూ. 50,713 కోట్లు కేటాయించారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు పథకానికి రూ. 22,500 కోట్లు, మహాలక్ష్మి, గృహజ్యోతి వంటి పథకాలకు భారీగా నిధులు మంజూరు చేశారు. అలాగే, రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున బీమా కల్పించే ఇందిరమ్మ ఫ్యామిలీ లైఫ్ ఇన్సూరెన్స్ పథకాన్ని జూన్ 2 నుంచి ప్రారంభించనున్నట్లు మంత్రి ప్రకటించారు. అయితే కేటాయింపులన్నీ ఇప్పుడు అమల్లో ఉన్న పథకాలకే వర్తిస్తున్నాయి. కొత్త పథకాలకు నిధులుకేటాయించ లేదు. పెన్షన్ల పెంపు, మహిళలకు నగదు వంటి పథకాలకు కేటాయింపులు లేకపోవడంతో ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా ఆ పథకాలు ప్రారంభించడం కష్టమని భావిస్తున్నారు.
అత్యధికంగా రెవెన్యూ వ్యయం రూ. 2,34,406 కోట్లుగా ఉండగా, మౌలిక సదుపాయాల కల్పన కోసం కేపిటల్ ఎక్స్పెండిచర్ కింద రూ. 47,267 కోట్లు కేటాయించారు. గత ఏడాదితో పోలిస్తే బడ్జెట్ పరిమాణం సుమారు 7 నుంచి 10 వరకూ శాతం పెరగింది. విద్యార్థుల కోసం బడ్జెట్లో కీలక ప్రకటనలు వెలువడ్డాయి. దివ్యాంగులైన విద్యార్థుల కోసం ప్రత్యేక వాహనాల పంపిణీకి నిధులు కేటాయించారు. అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుకునే ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. వైద్య రంగంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణం, ప్రభుత్వ ఉద్యోగులు . పెన్షనర్ల కోసం దేశంలోనే తొలిసారిగా భారీ ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు 10.7 శాతంగా నమోదైనట్లు ప్రకటించారు. ఇది జాతీయ సగటు కంటే మెరుగ్గా ఉందన్నారు.











