తెలంగాణలో వాహనదారులకు ఇది ముఖ్యమైన హెచ్చరిక. పెండింగ్ చలాన్ల వసూలు, వాటిపై వచ్చే వివాదాల పరిష్కారం కోసం ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి, పెండింగ్ చలాన్లను చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తే ఇకపై తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిబంధనలు పదేపదే అతిక్రమించినా, జరిమానాలు కట్టకపోయినా వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ), డ్రైవింగ్ లైసెన్స్ (డీఎల్) స్తంభింపజేసే (ఫ్రీజ్) కఠిన నిబంధనలను అమలు చేసేందుకు రవాణా శాఖ కసరత్తు చేస్తోంది.
అభ్యంతరాలు చెప్పవచ్చు :
వాహనదారులకు చలాన్ అందిన 45 రోజుల్లో వాహనదారుడు జరిమానా కట్టాలి, లేదా ఆన్లైన్లో అభ్యంతరం తెలపాలి. దీనిపై ఫిర్యాదు అందిన 30 రోజుల్లోగా అధికారులు తమ నిర్ణయం వెల్లడించాలి. వాహదారుల చలాన్ల జారీ లో అధికారుల నిర్ణయంపై అసంతృప్తిగా ఉంటే, చలాన్ మొత్తంలో 50శాతం చెల్లించి కోర్టును ఆశ్రయించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. అలాగే చలాన్ల జారీ నుంచి పరిష్కారం వరకు ప్రభుత్వం స్పష్టమైన కాలపరిమితులను నిర్దేశించింది. కెమెరా ఆధారిత చలాన్‌ను 3 రోజుల్లో, మాన్యువల్ చలాన్‌ను 15 రోజుల్లోగా పంపాలి.
5 కంటే ఎక్కువ పెండింగ్‌లో ఉంటే.. బ్లాక్ లిస్ట్ :
ఈ విధానంలో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే, ఒక వాహనంపై ఏడాదిలో 5 కంటే ఎక్కువ చలాన్లు పెండింగ్‌లో ఉంటే, ఆ సమాచారం నేరుగా రవాణా శాఖకు వెళ్తుంది. వెంటనే సంబంధిత వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ లేదా వాహన ఆర్సీని అధికారులు బ్లాక్ చేస్తారు. పెండింగ్‌లో ఉన్న చలాన్లన్నీ పూర్తిగా చెల్లించిన తర్వాతే బ్లాక్ లిస్ట్ నుండి తిరిగి పునరుద్ధరిస్తారు. ఈ కఠిన నిబంధనల ద్వారా వాహనదారుల్లో బాధ్యతను పెంచడంతో పాటు, రాష్ట్రంలో రహదారి భద్రతను మెరుగుపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.











