సుమారు పదేళ్లుగా నిలిచిపోయిన ప్రభుత్వ సినీ పురస్కారాల ప్రదానోత్సవాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో పునఃప్రారంభించారు. నిలిచిపోయిన సినీ అవార్డుల కార్యక్రమం రేవంత్ రెడ్డి చొరవతో మళ్లీ ప్రారంభం కావడం హర్షణీయమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కెసిఆర్ ప్రభుత్వం ఈ సినీ అవార్డుల కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేసిందని, అయితే సీఎం రేవంత్ రెడ్డి కృషితో పదేళ్ల తర్వాత ఈ కార్యక్రమం మళ్లీ ప్రారంభం కావడంపై భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌లోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ వేడుకల సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రజా గాయకుడు ‘గద్దర్ కేవలం ఒక వ్యక్తి కాదు, ఆయనొక వ్యవస్థ. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, ఇక్కడి పాటను ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు. గద్దర్ పేరు మీద ఈ అవార్డులను ఏర్పాటు చేయడం ఆయనకు ఇచ్చే అసలైన గౌరవమని ఆయన అన్నారు.
సినిమా అంటే కేవలం వినోదం కాదు, అది ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి. సమాజంలో మంచి తెచ్చేవిధంగా భట్టి విక్రమార్క అన్నారు. ‘సత్య హరిశ్చంద్ర’, ‘కన్యాశుల్కం’ వంటి చిత్రాలు సమాజంలో మార్పు తెచ్చాయని గుర్తుచేశారు. సామాజిక సందేశంతో కూడిన చిత్రాలు నేడు వాణిజ్యపరంగా కూడా విజయవంతం కావడం అభినందనీయమన్నారు. ఇక రోజుల్లో తెలుగు చిత్ర పరిశ్రమ నేడు హాలీవుడ్ స్థాయికి ఎదిగిందని అయన ప్రశంసించారు.
ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నేతృత్వంలోని జ్యూరీ అత్యంత పారదర్శకంగా అవార్డు గ్రహీతలను ఎంపిక చేసిందని డిప్యూటీ సీఎం కొనియాడారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్, నాగార్జున వంటి దిగ్గజాలు హాజరుకావడం తెలంగాణ ప్రజలకు గర్వకారణమని అన్నారు. అనంతరం అవార్డులు గెలుచుకున్న వారందరికీ శుభాకాంక్షలు తెలిపి, భవిష్యత్తులోనూ మంచి పాత్రలతో సమాజానికి స్ఫూర్తినివ్వాలని భట్టి విక్రమార్క ఆకాంక్షించారు.











