తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తిరుమల శ్రీవారి భక్తులకు కీలక సమాచారం అందించింది. 2026 జూన్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లు, ఆర్జిత సేవలు, వసతి గదుల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేసేందుకు పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించింది. శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు ఈ తేదీలను గమనించి, ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడి సూచించింది.
షెడ్యూల్ తేదీల వారీగా :
మార్చి 18:
సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన వంటి ఆర్జిత సేవా టికెట్ల కోసం ఉదయం 10 గంటలకు ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది.
ఈ డిప్ కోసం మార్చి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. టికెట్లు పొందిన వారు మార్చి 22 మధ్యాహ్నం 12 గంటలలోపు డబ్బు చెల్లించి ఖరారు చేసుకోవాలి.
మార్చి 21:
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, జ్యేష్ఠాభిషేకం టికెట్లను ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటికి సంబంధించిన దర్శన స్లాట్ల కోటాను అందుబాటులో ఉంచుతారు.
మార్చి 23:
అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను ఈరోజు ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.
శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల ఆన్‌లైన్ కోటాను ఈరోజు ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు.
మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల కోసం ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను విడుదల చేస్తారు.
మార్చి 24:
ఈరోజు ఉదయం 10 గంటలకు రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను విడుదల చేస్తారు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని వసతి గదుల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
భక్తులు ttdevasthanams.ap.gov.in అనే అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు.











