ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ‘కళాప్రపూర్ణ కాంతారావు జాతీయ అవార్డు-2025’ కార్యక్రమంలో టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు నటుడు కాంతారావును ప్రశంసించే క్రమంలో, ఆయన నటన చూసి ఎంజీఆర్ భయపడేవారని, వణికిపోయేవారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తమిళనాట తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
ఈ నేపథ్యంలో తమిళ సినీ ప్రముఖులు కూడా స్పందించారు. ప్రముఖ నటుడు నాజర్, నిర్మాత విశాల్ కూడా రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.ఎంజీఆర్ వంటి మహోన్నత వ్యక్తిని ఒకరితో పోలుస్తూ చిన్నబుచ్చేలా మాట్లాడటం తగదని, ఇది తమిళ ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని వారు పేర్కొన్నారు. రాజేంద్రప్రసాద్ వెంటనే క్షమాపణ చెప్పాలని విశాల్ డిమాండ్ చేశారు.
ఈ విషయంపై సౌత్ ఇండియా ఆర్టిస్ట్ అసోసియేషన్ (నడిగర్ సంఘం) వివరణ కూడా కోరిందని విశాల్ గుర్తుచేశారు. ఈ వివాదం మరింత ముదురుతున్న నేపథ్యంలో రాజేంద్రప్రసాద్ తమిళంలో ఒక వీడియో సందేశం విడుదల చేశారు. తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణలు కోరారు. కాంతారావు గారిని పొగిడే క్రమంలో నోరుజారాను.
అయితే తన ప్రసంగంలో అనుకోకుండా ఆ మాటలు వచ్చాయని, ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం లేదని ఆయన స్పష్టం చేశారు. తన వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే హృదయపూర్వకంగా క్షమించాలని కోరారు. ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా మరింత జాగ్రత్తగా మాట్లాడుతానని రాజేంద్రప్రసాద్ హామీ ఇచ్చారు.
రాజేంద్రప్రసాద్ క్షమాపణతో వివాదానికి తెర పడినట్లయింది. నేపథ్యంలో నిర్మాత విశాల్ స్పందించారు. ఇది రాజేంద్రప్రసాద్ గారి నిజమైన గొప్పతనం, వినయానికి నిదర్శనమని అభినందించారు. రాజేంద్రప్రసాద్ హృదయపూర్వకంగా క్షమాపణ చెప్పడాన్ని తాను మెచ్చుకుంటున్నట్లు అయన పేర్కొన్నారు.











