బంగాళాఖాతంలోని వాయుగుండం సెప్టెంబర్ ఒకటో తేదీ ఆదివారం తెల్లవారుజామున విశాఖపట్నం, గోపాలపూర్ ప్రాంతాల మధ్య తీరం దాటనుంది. వాయుగుండం తీరం దాటిన 24 గంటల వరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం ప్రభావంతో వాతావరణ శాఖ తెలంగాణలో రెడ్ అలర్ట్ జారీ చేసింది. రెండు రోజులపాటు ఈ రెడ్ అలర్ట్ ఉంటుందని స్పష్టం చేసింది. అంటే.. ఆగస్ట్ 31వ తేదీ, సెప్టెంబర్ ఒకటో తేదీన.. శని, ఆదివారాలు.. ఈ రెండు రోజులు అతి భారీ వర్షాలు పడనున్నట్లు హెచ్చరించింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో కొన్ని చోట్ల కుండపోత వర్షాలు పడనున్నట్లు స్పష్టం చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. రాష్ట్ర వ్యాప్తంగా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంగా ఈదురుగాలులు వీచే అకాశం ఉంది.
జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు.. అంటే కుండపోతగా వర్షాలు పడనున్నాయి. నల్గొండ, నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది . ఇక మిగతా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆగస్ట్ 31వ తేదీ శనివారం మధ్యాహ్నం వరకు నారాయణపేటలో అత్యధికంగా 13 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.