తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో జిల్లాల కలెక్టర్లతో తెలంగాణ సీఎస్ శాంతికుమారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా జిల్లాల్లో పాఠశాలలకు సెలవులపై కలెక్టర్లదే తుది నిర్ణయమని ఆమె అన్నారు . రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో జిల్లాల్లో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ప్రజలను అప్రమత్తం చేసేందుకు కంట్రోల్ రూంలను ఏర్పాటు చేయాలని సూచించారు.
ప్రజలు లోతట్టు, వరద ప్రాంతాలకు వెళ్లకుండా చూడాలన్నారు. ఉద్ధృతంగా ప్రవహించే వాగుల వద్ద ఒక అధికారితో పర్యవేక్షించాలన్నారు. మంచి నీటి ట్యాంకులు కలుషితం కాకుండా చూడాలని సూచన చేశారు. మ్యాన్ హోళ్లు తెరవకుండా చూడాలన్నారు. వరదలు వస్తే సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలన్నారు. కొన్ని ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ అయ్యే అవకాశాలున్నాయని హెచ్చరించారు.