తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేష్ తరపున కూటమి నేతలు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి నియోజక పరిధిలోని పలువురు నాయకులూ, కార్యకర్తలు హాజరైనారు. నామినేషన్ దాఖలులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సాంప్రదాయాన్ని లోకేష్ కొనసాగించారు. యువనేత లోకేష్ తరపున కూటమికి చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నేతలు 2సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలుచేశారు. మంగళగిరి టిడిపి సమన్వయకర్త నందం అబద్దయ్య, జనసేన సమన్వయకర్త చిల్లపల్లి శ్రీనివాసరావు, బిజెపి సమన్వయకర్త పంచుమర్తి ప్రసాద్ నేతృత్వంలో మధ్యాహ్నం 2.34 గంటలకు రిటర్నింగ్ అధికారి రాజకుమారి గనియాకు నామినేషన్ పత్రాలు అందజేశారు.
ఉదయం 10.30గంటల ప్రాంతంలో టీడీపీ-జనసేన-బీజేపీకి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నేతలు పాతమంగళగిరి సీతారామ కోవెల వద్దకు చేరుకున్నారు. నారా లోకేష్ నామినేషన్ పత్రాలతో కూటమినేతలు ఆలయంలో పూజలు నిర్వహించగా, వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం ఆలయం వెలుపల హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మతపెద్దలు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలతో సీతారామకోవెల పరిసరాలు జాతరను తలపించాయి.
నామినేషన్ కార్యక్రమంలో గుంటూరు పార్లమెంటు టిడిపి ప్రధానకార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, మంగళగిరి పట్టణ అధ్యక్షుడు దామర్ల రాజు, మంగళగిరి మండలపార్టీ అధ్యక్షులు తోట పార్థసారధి, రాష్ట్ర బిసిసెల్ ఉపాధ్యక్షుడు రేఖా సుధాకర్ గౌడ్, రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు దొప్పలపూడి జ్యోతిబసు, తెలుగుమహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య, గుంటూరు పార్లమెంటు ఎస్సీ సెల్ అధ్యక్షుడు వేమూరి మైనర్ బాబు, పట్టణ పార్టీ మాజీ అధ్యక్షుడు ఇట్టా పెంచలయ్య, నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ ఇబ్రహీం, నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి, పార్టీ సీనియర్ నాయకుడు దొంతిరెడ్డి సాంబిరెడ్డి, జనసేన రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయశేఖర్, సంకా బాలాజీ గుప్త, నైనాల లావణ్య, చాగంటిపాటి పూర్ణ చంద్రరావు తదితరులు పాల్గొన్నారు.