భారీ వర్షాలు, వరదలతో ఫిలిప్పీన్స్ అతలాకుతలమవుతున్నది. వేడి, చల్లని గాలులు కలిసి భారీ మేఘాలను ఏర్పరచడం వల్ల కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. భారీ వర్షాలకు వరదలు పోటెత్తడంతో ఇప్పటివరకు 13 మంది మరణించగా, 23 మంది గల్లంతయ్యారు. వర్షాల కారణంగా 45 వేలకిపైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు.
దీంతో వారందరినీ పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రోడ్లు కొట్టుకుపోయాయి. దీంతో రవాణాకు అంతరాయం ఏర్పడింది. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి. భారీ వర్షాల ప్రభావంతో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.