కాంగ్రెస్ పార్టీ ని బలోపేతం చేసేందుకు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టబోతున్నారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా ఈ పాదయాత్ర చేస్తున్నట్లు సమాచారం. పాదయాత్రను దేశంలోని అన్ని రాష్ట్రాలను కలుపుతూ ఈ పాదయాత్ర చేయాలనీ చూస్తున్నారు. అక్టోబర్ 2 నుంచి ప్రారంభం కానున్న పాదయాత్రను తెలంగాణ నుంచి ప్రారంభించాలని పార్టీ అధిష్ఠానాన్ని కోరనున్నట్లు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. సోమవారం గాంధీ భవన్‌లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన.మాట్లాడారు. సెంటిమెంట్‌గా యాత్రను తెలంగాణలో ప్రారంభిస్తే బాగుంటుందన్న విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తామని అన్నారు.
చింతన్ శిబిర్ లో తీసుకున్న అన్ని అంశాలను టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో ఆమోదిస్తూ ఏకగ్రీవ తీర్మానంతో సోనియా గాంధీకి పంపాలని నిర్ణయించినట్లు రేవంత్ తెలిపారు. చింతన్ శిబిర్ లో వరంగల్ డిక్లరేషన్ గురించి మాట్లాడడం సంతోషంగా ఉందన్నారు. సభ్యత్వ నమో దు విజయవంతంగా చేశామన్న రేవంత్..సభ్యులకు ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే గాంధీభవన్ లో సమాచారం అందించాలన్నారు.
వరంగల్ రైతు డిక్లరేషన్ ను జనం లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు రేవంత్. రాజీవ్ గాంధీ వర్దంతి సందర్భంగా మే 21 నుంచి నెల రోజుల పాటు రైతు రచ్చబండ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. రైతు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో ప్రజలతో చర్చించాలని పార్టీ నేతలకు రేవంత్ సూచించారు.