తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వడగళ్ల వాన జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. వడగళ్ల వాన పలుచోట్ల తీవ్ర బీభత్సాన్ని సృష్టించాయి. ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం, వెంకటాపురం, వాజేడు మండలాల్లో భారీగా వడగళ్ల వర్షం కురిసింది. ఈదురుగాలుల ధాటికి పలు గ్రామాల్లో ఇళ్లపై ఉన్న రేకులు ఎగిరిపోయాయి. ప్రజలు భయంభ్రాంతులకు గురయ్యారు. ఏటూరునాగారం – కమలాపూర్ ప్రధాన రహదారిలో భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చేతికి వచ్చే దశలో ఉన్న మిర్చి, వరి పంటలు దెబ్బతినడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.
నంద్యాల జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలుల ధాటికి వందల ఎకరాల్లో అరటి తోటలు నేలకొరిగాయి. కోతకు సిద్ధంగా ఉన్న పంట నేలపాలు కావడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆకస్మిక వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నేలకూలిన విద్యుత్ తీగలు, స్తంభాలతో అత్యంత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. పంట నష్టపోయిన రైతులు తమ వివరాలను సంబంధిత వ్యవసాయ అధికారులకు తెలిపాలని, ప్రభుత్వం నుంచి అందే సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. రాబోయే కొన్ని గంటల్లో మళ్లీ వర్ష సూచన ఉన్నందున సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు సూచించారు.











