ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర రావు(90) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో కొన్ని రోజులుగా HYDలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో ICUలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ తుది శ్వాస విడిచారు. నాదెండ్ల మృతి పట్ల పలువురు ఏపీ మంత్రులు సంతాపం ప్రకటించారు. 1984లో అప్పటి సీఎం ఎన్టీఆర్ హార్ట్ సర్జరీ కోసం అమెరికా వెళ్లొచ్చిన సమయంలో నెల రోజుల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నెల రోజులకే ఆ ప్రభుత్వం కూలిపోయింది. రాష్ట్ర చరిత్రలో అతి తక్కువ కాలం ఆ పదవిలో ఉన్న వ్యక్తిగా నాదెండ్ల భాస్కర రావు నిలిచారు.
గుంటూరు జిల్లా నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించి, రాష్ట్ర, జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేశారు’ 1980వ దశకంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అనేకమంది యువ నాయకులకు రాజకీయ దిశానిర్దేశం చేసిన గొప్ప మహనీయుడని ఆమె పేర్కొన్నారు. నాదెండ్ల భాస్కరావు మృతి రాష్ట్రానికి తీరనిలోటని ఏపీ హోం మంత్రి అనిత అన్నారు. అయన మృతికి హోం మంత్రి సంతాపం తెలిపారు. మంత్రి నాదెండ్ల మనోహర్ కుటుంబ సభ్యులకు ఆమె ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
రాజకీయాల్లో నైతిక విలువలు, క్రమశిక్షణకు ప్రతీకగా ఆయన జీవితం తరతరాలకు ఆదర్శమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. నాదెండ్ల మృతిపై మంత్రి సవిత సంతాపం తెలిపారు. చట్టసభల పనితీరుపై ఆయనకు అపారమైన అవగాహన ఉందని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. నాదెండ్ల భాస్కర్ రావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.











