తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు మంగళవారం మహబూబాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయన మాట్లాడారు. తెలంగాణ రాకుంటే మహబూబాబాద్ జిల్లానే లేదని, అలాగే మెడికల్ కాలేజీ ఎలా వచ్చేదని ఆయన అన్నారు. 65 సంవత్సరాలలో తెలంగాణ వ్యాప్తంగా మూడు మెడికల్ కాలేజీలు ఉంటే, గత 7 సంవత్సరాలలో వాటిని 33కు పెంచుకున్నామని మంత్రి పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వ దవాఖానాలకు రండి. నాణ్యమైన ఉచిత సేవలు వినియోగించుకోవాలని మంత్రి హరీష్ రావు సూచించారు.
తెలంగాణలో మాత్రమే 24 గంటలూ కరెంట్ అందిస్తున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఢిల్లీ, ఏపీ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ప్రజలు కరెంట్ కోతలతో ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఏపీలో రోజు 6 గంటల కరెంట్ కోత ఉందని, తెలంగాణలో మాత్రం 24 గంటల కరెంట్ అందిస్తున్నామని అన్నారు. రోజులో ఒక్క నిమిషం కూడా కరెంట్ కట్ అన్నదే లేదని, ఇది ఎవరైనా ఊహించారా? అని ప్రశ్నించారు. తెలంగాణలోని మారుమూల తండాలో కూడా 24 గంటల కరెంట్ ఇస్తున్న ఘనత కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు.