పోలీస్ స్టేషన్ లో దొంగలు పడ్డారు. ఏకంగా స్టేషన్లో ఉన్న బైక్ కు దొంగలు ఎత్తుకెళ్లారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి వాహనం చోరీ కావడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే ఒక వ్యక్తికి సంబంధించిన బైక్ నిన్న కేపీహెచ్ బీ పరిధిలో చోరీకి గురైంది. దీంతో వాహన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో నిన్న రాత్రి మాదాపూర్ లో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలను నిర్వహిస్తుండగా బైక్ తో సహా దొంగ పట్టుబడ్డాడు.
దీంతో వాహనాన్ని జప్తు చేసిన పోలీసులు వాహనాన్ని మాదాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే ఎవరూ లేని సమయాన్ని చూసుకుని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి దుండగుడు బైక్ ను దొంగిలించి పారిపోయాడు. మరోవైపు చోరీ విషయం గురించి తెలియని పోలీసులు వాహన యజమానికి ఫోన్ చేసి మాదాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు రావాల్సిందిగా కోరారు. ఆయన అక్కడకు వెళ్లి చూసే సరికి బైక్ లేదు. దీంతో ఆయనతో పాటు, పోలీసులు సైతం షాక్ కు గురయ్యారు.