కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకుడికి ఎంతో కొంత మేలు చేసిందని,ఇప్పుడు పార్టీకి ఆ రుణం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. ఈ నెల 13 నుంచి ఉదయ్‌పూర్ లో జరగనున్న చింతన్ శిబిర్ సన్నాహకాలపై సోమవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం జరిగింది.
ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకుడిని అన్నివిధాలుగా అదుకుందని, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అందరు క్రమశిక్షణతో పార్టీ పునర్వైభవానికి కృషి చేయాలనీ ఆమె కోరారు. పార్టీ పునర్నిర్మాణం దిశగా పలు సూచనలు చేశారు. పార్టీ శ్రేణులు క్రమశిక్షణతో, దృఢ సంకల్పంతో ముందుకు సాగితే ఫలితాలు వాటంతటవే వస్తాయని ఆమె చెప్పారు. చింతన్ శిబిర్‌ను తేలికగా తీసుకోరాదని, పార్టీ పునరుజ్జీవం దిశగా జరిగే కీలక భేటీగా గుర్తించాలని సోనియా సూచించారు.