కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీల ప్రత్యేక సీట్ల కోటాను రద్దు చేశారు. ఈ మేరకు కేంద్రీయ విద్యాలయాల నిర్వహణను పర్యవేక్షిస్తున్న కేంద్రీయ విద్యాలయ సంఘటన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పార్లమెంట్ సభ్యులతో పాటు ఇతర కోటాల కింద భర్తీ చేసే సీట్ల భర్తీ ప్రక్రియను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. అయితే, కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీలకు ప్రతి ఏటా 10 సీట్లను కేటాయిస్తున్నారు. ఆ సీట్లను తమకు అనుకూలంగా ఉన్న వారి పిల్లలకు కేటాయిస్తూ ఎంపీలు లేఖలు జారీ చేస్తున్నారు. మరికొందరు ఎంపీలు తమ పరిమితికి మించి కూడా సిఫారసు లేఖలు పంపుతున్నారు.
అయితే, కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీల కోటాపై లోక్‌సభలో చర్చ జరిగింది. కానీ కోటాను ఎత్తి వేయాలని కొందరు.. పెంచాలని మరికొందరు ఎంపీలు కోరారు. దీంతో అన్ని రాజకీయ పార్టీలతో కలిసి చర్చించనున్నట్లు పార్లమెంటు సమావేశాల సందర్బంగా కేంద్రం ప్రకటించింది. ఈ విషయమై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను స్పీకర్ ఓం బిర్లా ఆదేశించారు. పది సీట్ల కోటా సరిపోదని.. దాన్ని పెంచాలని.. లేదంటే రద్దు చేయాలని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారి డిమాండ్ చేశారు. సదరు ఎంపీ ప్రశ్నకు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ…ఎంపీల కోటాను రద్దు చేసే యోచనలో కేంద్రం ఉందని తెలిపారు. ఆ సమయంలో మంత్రి నిర్ణయాన్ని పలువురు ఎంపీలు వ్యతిరేకించారు.