Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

సర్వే నెం 77 ల పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి : కట్టెల మల్లేశం

శంషాబాద్ మండలం, ముచ్చింతల్ గ్రామం లోని 77 సర్వేనెంబర్ లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అంబేద్కర్ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల మల్లేశం డిమాండ్ చేశారు. గురువారం ముచ్చింతల్ గ్రామంలో ఆ సంఘం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు జెడి. రమేష్ ఆధ్వర్యంలో ఈ విషయమై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 సంవత్సరాల క్రితమే ఇక్కడ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నట్లు అప్పటి పాలకులు హామీ ఇచ్చారని తెలిపారు.

కానీ ఇప్పటివరకు ఏ ఒక్కరికి ఇళ్ల స్థలం ఇచ్చిన దాఖలాలు లేవని విమర్శించారు. హైదరాబాద్ నగరానికి అతి సమీపంలో ఉన్న ఈ గ్రామంలో అనేకమంది పేదలు ఇళ్ల స్థలం లేనటువంటి దుస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరిని వదిలిపెట్టి ప్రస్తుతం ఆ స్థలం బడా రియల్ వ్యాపారవేత్తలకు కట్టబెట్టేందుకు పాలకులు కుట్ర చేస్తున్నట్లు తెలుస్తోందన్నారు. ఇది సరైనది కాదని ప్రభుత్వ ఆస్తి ప్రజలకు దక్కాలని అన్నారు.

ఇల్లు లేని నిరుపేదలకు అక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇక్కడ ఇళ్ల స్థలాల సాధన కోసం తమ సంఘం ఆధ్వర్యంలో పోరాటం నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. ఇందుకోసం మార్చి రెండవ తేదీన శంషాబాద్ మండల తహసిల్దార్ కు వినతి పత్రం అందజేయనున్నట్లు తెలిపారు. పేదల పక్షాన, పేదల కోసం జరుగుతున్న ఈ పోరాటంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని, ఇళ్ల స్థలాలు సాధించుకునే వరకు అలుపెరుగని పోరాటం చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ప్రజా సంఘం రాష్ట్ర కార్యదర్శి బేగరి మహేష్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మైలారం సుబ్రహ్మణ్యం, రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు జెడి. రమేష్, మహిళా విభాగం జిల్లా కార్యదర్శి పెద్దేటి జ్యోతి, గ్రామపంచాయతీ సభ్యులు కందూరి చంద్రకళ, కందూరి శంకరమ్మ, మాజీ వార్డు మెంబర్ కత్తుల ప్రేమయ్య, ఎమ్మార్పీఎస్ గ్రామ అధ్యక్షుడు కత్తుల నవీన్, గ్రామస్తులు పాల్గొన్నారు.

RSS
Follow by Email
Latest news