Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

అమలులో ఉన్న చట్టాల్లో నిరుపయోగంగా ఉన్న చట్టం ఇదే…!

దేశంలో అమలులో ఉన్న చట్టాల్లో నిరుపయోగంగా ఉన్న చట్టం ఏదైనా ఉందంటే..? అది ఫిరాయింపుల చట్టం. అని చెప్పకనే చెప్పవచ్చు. నాయకులను చట్టసభకు పంపిన తరువాత వారు పార్టీ మారితే.. ప్రజలకు ప్రశ్నించే హక్కు ఇవ్వని చట్టం. ముప్పై ఎనిమిదేళ్ళలో ఫిరాయింపుల నిరోధక చట్టం సాధించిందేమిటి?

(ఫిబ్రవరి 15 నాటికి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అమలులోకి వచ్చి ముప్పై ఎనిమిదేళ్లు నిండిన సందర్భంగా)

ప్రజాస్వామ్య దేశంలో జరిగే ఎన్నికలు తమను పరిపాలించాల్సిన నాయకత్వాన్ని ఎంచుకునే స్వేచ్ఛను ప్రజలకు కల్పిస్తున్నాయి. తమకున్న ఓటు హక్కు ద్వారా ప్రజలు ఈ స్వేచ్ఛను అనుభవిస్తున్నారు. వయోజనులైన ప్రతి పౌరుడు పౌరురాలు ఓటరుగా నమోదు చేసుకోవడమే కాకుండా ఎన్నికలలో ఎలాంటి లాభాపేక్షకు ప్రలోభాలకు బంధుప్రీతికి లోనూకాకుండా ఓటు హక్కును వినియోగించుకుంటే మనం కోరుకున్న మంచి నాయకులు ఎన్నికై దేశాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తారు.

ప్రజాస్వామ్య స్ఫూర్తికి వెన్నెముక వంటి ఓటు హక్కు మన భవిష్యత్తును నిలబెడుతుంది. కుల, మత, లింగ, జాతి, ప్రాంత, బాషా బేధాలు లేకుండా పద్దెనిమిదేళ్లు నిండిన స్త్రీ పురుషులందరికీ మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ద్వారా కల్పించబడిన ఓటు హక్కు ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం జనవరి 25 ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుతుంది. “మీ ఓటు మీ గళం”, “దేశాన్ని మార్చడం మీ చేతుల్లోనే ఉంది” అంటూ ఓటు హక్కు ప్రాధాన్యతను ప్రతిబింబించే విధంగా ఎన్నో నినాదాలు కూడా మన చెవుల్లో మారుమ్రోగుతున్నాయి. ఓటు అన్న రెండక్షరాల పదం ఎంత విలువైనదో ప్రజలకు అవగాహన కల్పించే ప్రభుత్వాలు నాయకులను మాత్రం మినహాయిస్తున్నాయి.

ఓటును ప్రజలు మాత్రమే గౌరవించాలా? నాయకులకు ఆ అవసరం లేదా? ప్రజలు వేసే ఓట్లను చట్ట సభల్లోకి నడిపించడానికి మెట్లలా ఉపయోగించుకునే నాయకులు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తున్న సందర్భాలు కోకొల్లలు. గెలిచాక ప్రజల అభిప్రాయాలను తమపై పెట్టుకున్న నమ్మకాన్ని పక్కన పెట్టి తమ ష్వలాభాపేక్ష కోసం  ఫిరాయింపులకు పాల్పడుతున్న ప్రజా ప్రతినిధులకు ఆయా ప్రభుత్వాలు మాత్రమే కాకుండా పార్టీ నాయకత్వాలు కూడా వత్తాసు పలకడం విచారకరం. ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడకుండా కేంద్రం 1985 ఫిబ్రవరి 15 న పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ నెలతో ఈ చట్టం వచ్చి ముప్పై ఎనిమిదేళ్లు దాటింది. అయితే ఈ ముప్పై ఎనిమిదేళ్ళ సుదీర్ఘ కాలంలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం దేశ రాజకీయాలపై చూపిన ప్రభావం శూన్యం.

పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అమలులోకి రాకముందు అంటే 1985 కంటే ముందు “రాజకీయ పార్టీ” అన్న పదం రాజ్యాంగబద్దంగా గుర్తించబడలేదు. 1967 మరియు 1971 సంవత్సరాలలో జరిగిన ఎన్నికల్లో గెలిచిన దాదాపు యాభై శాతం మంది నాయకులు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు. రాజకీయ గందరగోళానికి దారితీసే ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం రూపొందించబడింది.

కానీ ఫిరాయింపులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో చివరిసారి జరిగిన శాసన సభ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల్లో పదిమందికి పైగా సొంత పార్టీని విడిచి అధికార పార్టీలోకి క్యూ కట్టారు. ఓటును హక్కుగా, బాధ్యతగా భావించే ఏ పౌరులు కూడా ఈ ఫిరాయింపులను ఆపలేకపోయారు. కారణం చట్టంలో ఉన్న లొసుగులే. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఫిరాయింపులను ప్రజలు కూడా ఇదేమి పెద్ద తప్పు కానట్లు చూసి చూడనట్లు వ్యవహరిస్తుండడం.

ఇక చట్టం విషయానికి వస్తే ఫిరాయింపులకు పాల్పడిన వారిపై ఫిర్యాదు చేసే అవకాశం ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు లేదు. ఆ అవకాశం ఆయా పార్టీల అధ్యక్షులకు మాత్రమే ఉంటుంది. ఒకవేళ ఏదైనా పార్టీ అధ్యక్ష్యుడు ఫిరాయింపులకు పాల్పడిన వారిపై చర్యలకోసం ఫిర్యాదు చేయాలన్నా శాసన సభ అధ్యక్షుడికి మాత్రమే చేయాల్సి ఉంటుంది.ఆయన దాన్ని అమోదించకపోయినా చేసేదేమీ లేదు. ఓట్లు వేసిన ప్రజలు ఎవ్వరూ కూడా ఫిరాయింపులకు పాల్పడిన వారిపై నేరుగా ఫిర్యాదు చేసేందుకు అవసరమైన సెక్షన్లు, విధానాలు చట్టంలో లేవు. బ్రెయిన్ డెడ్ అయిన లేదా కోమాలో ఉన్న వ్యక్తి మనం మాట్లాడేవన్నీ వింటూ, అర్థం చేసుకుని కూడా కదల్లేని స్థితిలో ఎలాగైతే ఉంటాడో అలాగే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కూడా ఎలాంటి ప్రభావాన్ని చూపలేని నిరర్ధక చట్టంగా మిగిలిపోయింది.

ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి, ప్రభుత్వ యంత్రాంగాలను ప్రచారంలో వాడుకున్నారని అలహాబాద్ హైకోర్టులో దాఖలైన ఒక కేసులో దేశ ప్రధాని సైతం విచారణకు హాజరు కావాల్సి వచ్చింది. ఇది జరిగింది 1971 లో. ఇలా కోర్టుకు హాజరైన వ్యక్తి భారత దేశ ప్రధాని, ఉక్కు మహిళగా పేరొందిన శ్రీమతి ఇందిరాగాంధీ. ఈ కేసులో ఆరోపణలు చేసిన వ్యక్తి ఇందిరాగాంధీకి పోటీగా నిలబడిన రాజ్ నారాయణ్ అనే సోషలిస్టు పార్టీ నేత. ఎన్నికల ప్రచారం కోసం ప్రభుత్వ అధికారిని, ప్రభుత్వ వాహనాన్ని ఉపయోంచించారని నిర్ధారించి ఆ కేసులో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా తీర్పునిచ్చింది అలహాబాద్ హైకోర్టు. దేశ ప్రధానిని సైతం కోర్టు మెట్లు ఎక్కించడానికి కారణం పోటీగా నిలబడిన వ్యక్తికి హైకోర్టులో పిటీషన్ వేసే అవకాశం ఉండటమే.

కానీ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఎన్నికైన శాసనసభ్యులు పార్టీ ఫిరాయించినప్పుడు ఓటర్లు గానీ పోటీగా నిలబడిన అభ్యర్థులు కానీ కోర్టుకు వెళ్ళే అవకాశం లేదు. కేవలం పార్టీ అధ్యక్షులు స్పీకర్ కు ఫిర్యాదు చేయాలి. ఒకవేళ పార్టీ అధ్యక్ష్యులు అధికార పార్టీతో కుమ్మక్కై మిన్నకుండినా అడిగే హక్కు ఎవరికీ లేదు. దేశంలో అమలులో ఉన్న చట్టాలన్నీ వివిధ దశల్లో ప్రభుత్వ అధికారులకు లేక ప్రభుత్వ యంత్రాంగాలకు నేరుగా ఫిర్యాదు చేసే అవకాశాన్ని ప్రజలకు కల్పిస్తున్నాయి. కానీ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో ఇలాంటి అవకాశాన్ని కల్పించకుండా ఈ చట్టం ప్రజలకు ఉపయోగపడడం కోసం కాదని కేవలం ప్రజలను మభ్యపెట్టడానికే అని చెప్పకనే చెబుతోంది.

మంత్రులను, ఎమ్మెల్యేలను తమ ఓటు హక్కు ద్వారా నేరుగా చట్ట సభలకు పంపగలిగిన ప్రజలకు వారు అక్రమాలకు అనైతిక రాజకీయాలకు తెరలేపినా అలాంటి వారిని వెనక్కు తీసుకువచ్చే ఎలాంటి పద్ధతి కూడా రూపొందించబడలేదు. ఎంత ఉన్నత స్థాయిలో ఉన్న ప్రజా సేవకులపై అయినా ఫిర్యాదు చేసి ఉద్యోగం నుండి తొలగించడానికి ఈ దేశంలోని చట్టాలు పౌరులకు కల్పించిన అవకాశాలు సుస్పష్టం. కానీ ఒక్కసారి ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన వారిని మాత్రం పదవీ కాలం ముగిసే వరకూ కదిలించలేని పరిస్థితి. ఈ పద్దతి మారి తప్పుచేసిన ప్రజా ప్రతినిధులను వెనక్కు పంపే విధంగా ఓటేసిన ప్రతి పౌరుడికి అవకాశం లభించినప్పుడు మాత్రమే నిజమైన ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది.

RSS
Follow by Email
Latest news