భారతదేశంలో మను వాదం పోతేనే దేశానికి భవిష్యత్తు ఉంటుందని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం స్టేట్ సెక్రటరీ జనరల్ కట్టెల మల్లేశం అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని బిఎస్పి పార్టీ కార్యాలయంలో శనివారం ఆ సంఘం నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ దేశంలో సంపద, పుష్కలమైన వనరులు ఉన్నప్పటికీ వెనకబాటుకు కులమే ప్రధాన కారణమని అన్నారు.
ఈ కుల వ్యవస్థ కారణంగా అత్యధికంగా ఉన్న బహుజన సమాజం చదువు అధికారం సంపదలకు దూరంగా నెట్టివేయబడ్డారని అయన అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా కేవలం కులప్రాతిపాదికపైనే మనుషులకు విలువ ఇచ్చే నీచమైన సంస్కృతి మన భారతదేశంలో కొనసాగుతుందని అయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మనువాదం శాస్త్ర సాంకేతికతకు విలువనివ్వదని తెలిపారు. మూఢనమ్మకాల పెంపును ప్రోత్సహిస్తుందని అన్నారు. దీనివల్లనే భారతదేశం అన్ని రంగాలలో వెనుకబాటుకు గురవుతుందని అన్నారు.వివరించారు.
కావున అంబేద్కర్ ఆలోచన విధానంలో ప్రధానమైన కుల వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని మల్లేశం పిలుపునిచ్చారు. తాండూరు మండలం జినగుర్తి గ్రామంలో దళితులకు చెందిన 220 ఎకరాల భూమిని ప్రభుత్వం లాక్కునేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని విరమించుకోవాలని అయన డిమాండ్ చేశారు. దళితులకు జీవనాధారమైన ఆ భూములను లాక్కుంటే సహించేది లేదని అయన హెచ్చరించారు. ఇందుకు నిరసనగా భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఇటీవలే స్టేట్ సెక్రటరీ జనరల్ గా బాధ్యతలు చేపట్టిన కట్టెల మల్లేశంను దళిత హక్కుల పోరాట సమితి నాయకులు బి.వెంకటేశం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బషీరాబాద్ మండలం ఎక్మాయి గ్రామానికి చెందిన మాల యాదగిరిని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం బషీరాబాద్ మండల ఇంఛార్జిగా , హన్మంపల్లి గ్రామానికి చెందిన మ్యాతరి అనిల్ కుమార్ ను పెద్దేముల్ మండల ఇంఛార్జిగా నియమిస్తూ కట్టెల మల్లేశం నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జినుగుర్తి శ్రీనివాస్, దశరథ్, నియోజకవర్గంలోని వివిధ గ్రామాల యువత పాల్గొన్నారు.