Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

75 స్థలాలను ‘ఫ్రీడమ్ పార్కులు’గా అభివృద్ధి.. జీహెచ్ ఎంసీ

75 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ ఎంసీ) నగరంలోని వివిధ ప్రాంతాల్లో 75 ఖాళీ స్థలాలను ‘ఫ్రీడమ్ పార్కులు’గా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఫ్రీడమ్ పార్క్‌ల అభివృద్ధికి మొత్తం 75 స్థలాలను గుర్తించడంతోపాటు, వాటిని అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని, అదే సమయంలో ప్రత్యేకమైన థీమ్ ఆధారిత స్వాగత బోర్డులను సిద్ధం చేయాలని జీహెచ్ఎంసీ యోచిస్తోంది.

అదే రోజు నగరంలోని పాఠశాలల్లో 75 మొక్కల చొప్పున నాటనున్నారు. స్కూల్స్, ఫ్రీడమ్ పార్కులతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజా ప్రతినిధులు, ఆయా కాలనీల సంక్షేమ సంఘాల సమన్వయంతో మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేపడుతామని జీహెచ్ఎంసీ అధికారి ఒకరు చెప్పారు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా అటు కేంద్రంతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అట్టహాసంగా వేడుకలు నిర్వహించేందుకు ప్రణాళిక రచించింది. రెండు వారాల పాటు ‘స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం’ జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా, ఉత్సవాల్లో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

ఈ క్రమంలో జీహెచ్ ఎంసీ ఫ్రీడమ్ పార్క్‌లను అభివృద్ధి చేసే ప్రణాళికతో ముందుకు వచ్చింది. ఈ ప్రణాళికలో భాగంగా  75 ఫ్రీడమ్ పార్కుల్లో బెంచీలు, నడక మార్గాలు, ప్రవేశ ద్వారాలతో పాటు 75 సంవత్సరాల స్వాతంత్య్రాన్ని వివరించే సుందరీకరణ పనులు కూడా చేపడుతున్నారు. వీటితో పాటు ఆ నెల 10వ తేదీన ఎంపిక చేసిన 75 ప్రాంతాల్లో  70,750  మొక్కలు కూడా నాటాలని నిర్ణయించింది.

కొన్ని పార్కుల్లో చెట్ల కొమ్మలు, బెంచీలు, గోడలు, ఇతర కాంక్రీట్ నిర్మాణాలకు త్రివర్ణ రంగులు వేయడంతోపాటు కొన్ని పార్కుల్లో 75 రకాల చెట్లను పెంచనున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారి ఒకరు తెలిపారు. ఫ్రీడమ్ పార్కుల వద్ద త్రివర్ణ పతాకంలో ఉండే సెల్ఫీ పాయింట్‌లను కూడా ఏర్పాటు చేస్తామని, వివిధ రకాల సుందరీకరణ పనులు చేపట్టనున్నట్టు అధికారులు తెలిపారు.

RSS
Follow by Email
Latest news