Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

మేము భారత్‌ కు వచ్చేది లేదు….. వేదిక మార్చాల్సిందేనంటున్న బంగ్లాదేశ్

టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుల మధ్య వివాదం తీవ్రరూపం దాల్చుతోంది. బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను బీసీసీఐ ఐపీఎల్ నుంచి అకస్మాత్తుగా తప్పించడంతో ఈ వివాదం మొదలైంది. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల నేపథ్యంలో రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు పెరగడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. ఫిబ్రవరి 7న ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌ల లో భాగంగా భరత్ తో తలపడాల్సిన మ్యాచ్ ల విషయంలో భద్రతా కారణాలను చూపుతూ, భారత్‌లో జరగాల్సిన తమ మ్యాచ్‌ల వేదికను మార్చాలన్న డిమాండ్‌కే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) కట్టుబడి ఉంది. తమ మ్యాచ్‌లను సహ-ఆతిథ్య దేశమైన శ్రీలంకకు తరలించాలని ఐసీసీకి లేఖ రాసింది. ఈ విషయంలో ఐసీసీ నుంచి ఇంకా సానుకూల స్పందన రానప్పటికీ, భద్రతాపరమైన ఆందోళనలపై కలిసి పనిచేస్తామని ఐసీసీ హామీ ఇచ్చినట్టు బీసీబీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.

భారత్, పాకిస్థాన్ జట్లు భద్రతా కారణాల వల్ల ఒకరి దేశంలో మరొకరు ఆడటం లేదని, వారి మ్యాచ్‌లను ‘హైబ్రిడ్ మోడల్’ పద్ధతిలో మూడో దేశంలో నిర్వహిస్తున్నారని, తమకు కూడా అదే తరహా వెసులుబాటు కల్పించాలని బీసీబీ కోరుతోంది. బీసీబీ అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం, ప్రభుత్వ సలహాదారు అసిఫ్ నజ్రుల్ ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. “భారత్‌లో ఆడేందుకు తమకు అనువైన వాతావరణం లేదు. బంగ్లాదేశ్ భద్రత, గౌరవం, ప్రతిష్ఠ‌ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు” అని వారు తేల్చిచెప్పారు. అయితే, తాము కచ్చితంగా టీ20 ప్రపంచకప్ ఆడాలనుకుంటున్నామని పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం ఆడకపోతే మ్యాచ్‌లను రద్దు చేస్తామని ఐసీసీ తమకు అల్టిమేటం జారీ చేసిందన్న వార్తలను బీసీబీ ఖండించింది. ప్రస్తుతం అందరి దృష్టి ఐసీసీ తీసుకోబోయే తుది నిర్ణయంపైనే ఉంది.

RSS
Follow by Email
Latest news