దేశంలో వెండి ధరలు చరిత్రలోనే తొలిసారిగా రికార్డు స్థాయికి చేరాయి. దేశీయ మార్కెట్లో 1 కిలో వెండి ధర రూ.3 లక్షలు దాటి రూ.3.05 లక్షలకు చేరి కొత్త మైలురాయిని నమోదు చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ సిల్వర్ ధర 100 డాలర్ల మార్కుకు చేరువలో ట్రేడవుతుండటంతో, దేశీయంగా MCX లో వెండి ధర కిలోకు రూ.3,01,000కు పైగా పలికింది. ఒక్కరోజులోనే దాదాపు రూ.10,000 పెరగడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.
సుంకాల ముప్పును అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మళ్లీ తెరపైకి తీసుకురావడం, యూరోపియన్ దేశాలతో వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడం వల్ల పెట్టుబడిదారులు వెండి, బంగారం వంటి సురక్షిత ఆస్తుల వైపు మొగ్గుచూపుతున్నారు. భౌగోళిక ఉద్రిక్తతలు, డాలర్ బలహీనత, అమెరికా వడ్డీ రేట్లు తగ్గే అంచనాలు కూడా వెండి ధరలకు మద్దతుగా మారాయి.











