Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

రాజస్థాన్‌ రాయల్స్‌ 8 వికెట్ల తేడాతో భారీ విజయం

సోమవారం సాయంత్రం జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్‌కింగ్స్‌ పై రాజస్థాన్‌ రాయల్స్‌ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బౌలింగ్‌కు అనుకూలించిన పిచ్ పై రాజస్థాన్‌ రాయల్స్‌ ఆటగాళ్లు రాణించారు. నాంద్రి బర్గర్‌ (2/19), జోఫ్రా ఆర్చర్‌ (2/26), రవీంద్ర జడేజా (2/18)లతో పాటు మిగతా రాజస్థాన్‌ బౌలర్లూ విజృంభించడంతో చెన్నై 19.4 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. ఎనిమిదో స్థానంలో వచ్చిన జేమీ ఒవర్టన్‌ (43; 36 బంతుల్లో 2×4, 2×6) ఒంటరి పోరాటంతో  చెన్నై సూపర్‌కింగ్స్‌ ను వంద పరుగుల మార్క్ ను దాటించాడు.

స్వల్ప లక్ష్యాన్ని రాయల్స్‌ 12.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. పిచ్, పరిస్థితులతో సంబంధం లేకుండా వైభవ్‌ సూర్యవంశీ (52; 17 బంతుల్లో 4×4, 5×6) తనదైన శైలిలో రెచ్చిపోయాడు. యశస్వి జైస్వాల్‌ (38 నాటౌట్‌; 36 బంతుల్లో 3×4, 1×6) రాణించాడు. చెన్నై బౌలర్లలో అన్షుల్‌ కాంబోజ్‌ (2/27) ఆకట్టుకున్నాడు.

ఆరంభంలోనే ప్రమాదకర వైభవ్‌ సూర్యవంశీ క్యాచ్‌ చేజారింది.. ఇక అంది వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని ఆకాశమే హద్దుగా చెలరేగిన వైభవ్‌ సూర్యవంశీ కేవలం 15 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు. మ్యాట్‌ హెన్రీ వేసిన తొలి ఓవర్లో వైభవ్‌ ఎదుర్కొన్న తొలి బంతికే డీప్‌ మిడ్‌వికెట్‌ వైపు బంతిని గాల్లోకి లేపాడు. క్యాచ్‌ కాస్త కష్టమైందే. అయినా కొత్త కుర్రాడు కార్తీక్‌ వెనక్కి పరుగెడుతూ క్యాచ్ పట్టే ప్రయత్నం చేశాడు. కానీ.. బంతి అందినట్లే అంది చేజారి బౌండరీకి వెళ్లిపోయింది. తర్వాతి బంతికే భారీ సిక్సర్‌ బాదిన అతను.. ఓవర్‌ చివరి బంతికి మరో ఫోర్‌ కొట్టాడు.

హెన్రీ రెండా ఓవర్ లో మరో సిక్సర్‌ బాదిన సూర్యవంశీ.. ఖలీల్‌ అహ్మద్‌ వేసిన అయిదో ఓవర్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌ కొట్టాడు. తర్వాత స్పిన్నర్‌ నూర్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో రెండు వరుస సిక్సర్లు తో చెలరేగిపోయాడు. అతడి దూకుడుతో పవర్‌ప్లేలో రాయల్స్‌ 74/0తో తిరుగులేని స్థితికి చేరుకుంది. కాంబోజ్‌ బౌలింగ్ లో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి వైభవ్  అవుట్ అయ్యాడు. అతడి స్థానంలో వచ్చిన జురెల్‌ (18) చకచకా నాలుగు ఫోర్లు కొట్టి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. జురెల్‌ వికెట్ కూడా కాంబోజే తీసుకున్నాడు. మరో ఎండ్‌లో నిలకడగా ఆడుతున్న యశస్వితో కలిసి రియాన్‌ పరాగ్‌ (14 నాటౌట్‌;  11 బంతుల్లో 1×4, 1×6) లాంఛనాన్ని పూర్తి చేశాడు.

ఈ నేపథ్యంలో చెన్నై.. రాజస్థాన్‌పై చెలరేగిపోతుందనే అనుకున్నారంతా. కానీ బ్యాటింగ్‌ కాస్త కష్టంగా ఉండి, బౌలర్లకు అనుకూలించిన గువాహటి స్టేడియంలో వికెట్లు నిలబెట్టుకోవడానికి, పరుగులు చేయడానికి ఆపసోపాలు పడింది సీఎస్కే. ఆ జట్టు 127 పరుగులు చేయడం కూడా గొప్పే అని చెప్పాలి. ఎందుకంటే ఒక దశలో 82 పరుగులకే 8 వికెట్లు పడ్డాయి. ఇంగ్లాండ్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ జేమీ ఒవర్టన్‌ ఆఖర్లో గొప్పగా పోరాడి జట్టుకు కాస్త గౌరవప్రదమైన స్కోరు సాధించి పెట్టాడు.

చెన్నై సూపర్‌కింగ్స్‌ ఇన్నింగ్స్‌ ఆరంభమే పేలవం సాగింది. తొలిసారి చెన్నైకి ఆడుతున్న సంజు శాంసన్‌.. తన మాజీ జట్టుపై తేలిపోయాడు. రాయల్స్‌ పేసర్‌ నాంద్రి బర్గర్‌.. తన రెండవ ఓవర్లో అద్భుతమైన బంతితో సంజు (6) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. మరో ఓపెనర్, చెన్నై కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (6).. ఆర్చర్‌ బౌలింగ్‌లో క్రీజు బయటికి వచ్చి ఆడబోయి అతను కూడా క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. గత ఏడాది చెన్నై తరఫున అదరగొట్టిన ఆయుష్‌ మాత్రే అండర్‌-19 కుర్రాడు… బర్గర్‌ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చిన డకౌటయ్యాడు.

షార్ట్‌ (2) ఎక్కువసేపు నిలవలేదు. ఆయుష్‌ స్థానంలో వచ్చిన సర్ఫరాజ్‌ ఖాన్‌ (17), ఇన్నింగ్స్‌ను బాగానే ఆరంభించినా.. జడేజా తన తొలి ఓవర్లో రెండో బంతికే అతడిని ఎల్బీడబ్ల్యు అవుట్ చేశాడు. ప్రమాదకర దూబె (6) ను కూడా  అదే ఓవర్లో వెనుదిరగడంతో చెన్నై 51 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పతనం దిశగా సాగింది. రూ.14.2 కోట్ల రికార్డు రేటుతో చెన్నై సొంతమైన కార్తీక్‌ శర్మ (18).. అరంగేట్రంలో ఆకట్టుకోలేకపోయాడు. నూర్‌ అహ్మద్‌ (1), హెన్రీ (5) కూడా పెవిలియన్‌కు క్యూ కట్టేయడంతో చెన్నై 100 కూడా చేయడం కష్టమే అనిపించింది. కానీ చివర్లో జేమీ ఒవర్టన్‌ ధాటిగా ఆడడంతో చెన్నై 127 పరుగులు చేసింది. రాయల్స్‌ బౌలర్లలో అందరికీ వికెట్లు దక్కాయి.

RSS
Follow by Email
Latest news