సాంకేతిక ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) హవానే నడుస్తోంది. అయితే, ఈ AI విప్లవం ఇప్పుడు సామాన్య వినియోగదారుల జేబుకు చిల్లు పెట్టబోతోంది. AI డేటా సెంటర్ల నుండి వస్తున్న విపరీతమైన డిమాండ్ కారణంగా గ్లోబల్ మార్కెట్‌లో RAM (ర్యామ్) , SSD (మెమరీ స్టోరేజ్) చిప్‌ల కొరత తీవ్రంగా ఏర్పడింది. ఐడీసీ (IDC) , సిటీ గ్రూప్ వంటి పరిశోధనా సంస్థల అంచనా ప్రకారం, ఈ మెమరీ చిప్‌ల కొరత 2027 వరకు కొనసాగే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌కు సరిపడా సరఫరా లేకపోవడంతో “చౌకైన మెమరీ , స్టోరేజ్ యుగం” ముగిసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత అక్టోబర్ నెల 2025 నుండే అనేక కంపెనీలు తమ ధరలను సవరించడం ప్రారంభించాయి. మీరు కొత్తగా లాప్‌టాప్ లేదా స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటే, త్వరలో కొనుక్కోవడమే ఉత్తమం. రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని, 2026లో స్మార్ట్‌ఫోన్లు, పర్సనల్ కంప్యూటర్ల ధరలు 5 నుండి 20 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని ప్రముఖ టెక్ కంపెనీలు హెచ్చరిస్తున్నాయి.
సామ్‌సంగ్, SK హైనిక్స్ వంటి దిగ్గజ సంస్థలు తమ మెమరీ చిప్ ఉత్పత్తిని సాధారణ స్మార్ట్‌ఫోన్లు, పీసీల నుండి లాభదాయకమైన AI డేటా సెంటర్ల వైపు మళ్లిస్తున్నాయి. AI సర్వర్లకు అవసరమైన హై-బ్యాండ్‌విడ్త్ మెమరీ (HBM) , DDR5 ర్యామ్ తయారీకి ప్రాధాన్యత ఇస్తుండటంతో, సాధారణ ఎలక్ట్రానిక్ వస్తువులకు వాడే చిప్‌ల సరఫరా తగ్గిపోయింది. దీనివల్ల ర్యామ్ , ఎస్‌ఎస్‌డీల ధరలు గత కొన్ని నెలల్లోనే రెండు మూడు రెట్లు పెరిగాయి. ఉదాహరణకు, గతంలో రూ. 3,000 కు లభించిన 16GB ర్యామ్ స్టిక్ ధర ఇప్పుడు రూ. 5,000 మార్కును దాటిపోయింది. ఈ మెమరీ సంక్షోభం కారణంగా డెల్ (Dell), లెనోవా (Lenovo), షియోమి (Xiaomi) వంటి కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది.











