తెలంగాణలో గత మూడు రోజులుగా ప్రజా రవాణాను స్తంభింపజేసిన ఆర్టీసీ ఐకాస నాయకులతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. 11 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించినట్లు అర్ధరాత్రి ఒంటిగంటకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై అధికారులు, కార్మిక సంఘాల నాయకులతో కమిటీ వేయాలని నిర్ణయించినట్లు అయన తెలిపారు.
చర్చలు సఫలమయ్యాయని.. బస్సులు యథావిధిగా నడుస్తాయని రవాణాశాఖ మంత్రి పొన్నంప్రభాకర్ తెలిపారు. కార్మికుల ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో, గత మూడు రోజులపాటు జరిగిన సమ్మెకు తెరపడినట్లయ్యింది. ప్రభుత్వ హామీతో ఇవాళ ఉదయం తొలి షిఫ్ట్ నుంచే బస్సులు రోడ్డెక్కాయి. ఉపముఖ్యమంత్రి, మంత్రుల బృందంతో చర్చలు జరిపిన ఐకాస నాయకులు 32 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు.
ఆత్మహత్య చేసుకున్న నర్సంపేట ఆర్టీసీ డిపో డ్రైవర్ శంకర్‌గౌడ్‌కి నివాళి అర్పిస్తూ.. సమావేశం ప్రారంభంలో మంత్రులు, అధికారులు, ఐకాస నేతలు రెండు నిమిషాలు మౌనం పాటించారు. డ్రైవర్ శంకర్‌గౌడ్ కుటుంబానికి రూ.10 లక్షలు, ఇందిరమ్మ ఇల్లు, ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.
తెలంగాణ సెక్రటేరియట్‌లో శుక్రవారం అర్ధరాత్రి వరకు మంత్రుల బృందంతో జేఏసీ నాయకులు తమ 32 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. ముఖ్యంగా 2021, 2025 సంవత్సరాలకు సంబంధించిన వేతన సవరణలు (పీఆర్సీ) అమలు చేయాలని, 30 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని పట్టుబట్టారు. కార్మికుల డిమాండ్లను సావధానంగా విన్న ప్రభుత్వం, వాటి పరిష్కారానికి అంగీకారం తెలిపింది.
ఆర్టీసీ ఐకాస నాయకులు మాలాడుతూ. .. గత ప్రభుత్వ హయాంలో 55 రోజుల సమ్మె చేసినప్పటికీ హామీల్ని అమలు చేయలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం 2013 వేతన సవరణ బాండ్స్ రూ.280 కోట్ల బకాయిల్ని తీర్చడంతో పాటు 2017కి సంబంధించి పీఆర్సీ, పెండింగ్ డీఏలు లేకుండా ఇచ్చిందన్నారు. ఉద్యోగుల ఇతర సమస్యలనూ వివరించారు. ఆర్టీసీలో యూనియన్లు లేకపోవడంతోనే ప్రభుత్వం అమలుచేస్తున్న కార్మిక సంక్షేమ కార్యక్రమాలకు ప్రచారం జరగలేదన్నారు. రెండు వేతన సవరణలు అమలు చేయడం, ప్రభుత్వ సర్వీసులో ఉద్యోగుల విలీనంతో పాటు కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని కోరారు.











