తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా చెబుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీశ్ రావు పాత్ర ఏమిటి? నిఘా పరికరాల కొనుగోలు లేదా సమాచార సేకరణలో ఆయనకు ఏవైనా సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో సిట్ (SIT) అధికారులు హరీశ్ రావు ను సుదీర్ఘంగా విచారించారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఈరోజుఉదయం నుంచి సుమారు 7 గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు.
హరీశ్ రావు విచారణ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఆయన విచారణకు హాజరవుతున్నారన్న సమాచారంతో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. గత కొంతకాలంగా ఈ కేసులో పోలీసు అధికారులు, ఇంటిలిజెన్స్ విభాగం నేతలను విచారించిన సిట్, ఇప్పుడు నేరుగా రాజకీయ ప్రముఖులపై దృష్టి సారించడం చర్చనీయాంశమైంది. ఈ విచారణ ప్రక్రియ కేవలం ప్రాథమిక సమాచారం కోసమా లేక హరీశ్ రావును నిందితుడిగా చేర్చే అవకాశం ఉందా అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
విచారణ అధికారులు అడిగిన ప్రశ్నలకు హరీష్ ఎలాంటి సమాధానాలు ఇచ్చారనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. సిట్ అడిగిన ప్రశ్నలపై హరీశ్ రావు స్పందన ఎలా ఉంటుంది? ఒకవేళ ఆయన ప్రభుత్వ తీరుపై ఘాటుగా స్పందిస్తే, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ – బీఆర్ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరే అవకాశం ఉంది.











