దళపతి విజయ్ చివరి సినిమాగా ప్రచారం జరుగుతున్న ‘జననాయగన్’ చుట్టూ నెలకొన్న హైడ్రామా కొనసాగుతూనే ఉంది. కొంతకాలంగా నిర్మాత ఈ సినిమా రిలీజ్ విషయంలో సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలని కోరుతూ కోర్టు మెట్లెక్కుతున్న సంగతి తెలిసిందే. ముందు షెడ్యూల్ ప్రకారం ‘జననాయగన్’ సినిమా జనవరి 9వ తేదీన సినిమా థియేటర్లలోకి రావాల్సి ఉంది. సెన్సార్ సర్టిఫికెట్ నిలిపివేయడంతో సినిమా విడుదల వాయిదా పడింది. ఈ కేసులో నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, మద్రాస్ హైకోర్టుకు వెళ్లాల్సిందిగా సర్వోన్నత న్యాయస్థానం సూచించింది.
సుప్రీంకోర్టు ఆదేశాలతో కేసు విచారణ నిర్వహించింది మద్రాస్ హైకోర్టు. తాజాగా ఈ సినిమా విడుదలపై తీర్పు రిజర్వ్ చేసింది మద్రాస్ హైకోర్టు. సెంట్రల్ బోర్డ్ ఫర్ ఫిలిం సర్టిఫికేషన్ తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. వాదనలు ఆలకించిన ప్రధాన న్యాయమూర్తి మహేంద్ర మోహన్ శ్రీవాస్తవ, జస్టిస్ అరుళ్ మురుగన్, సినిమా విడుదలపై తీర్పు రిజర్వ్ చేశారు.











