ఆరోజు అది..19.01.1996…
ఆరోజు ఎందుకో ఎప్పటిలా తెల్లారిందని అనిపించలేదు.. ఏదో వెలితి.. ఎక్కడో ఏదో జరగరానిది జరిగిందని అనిపించింది.. ముందు రోజు రాత్రి నుంచే మొదలైంది మనసులో కలవరం..నిద్రపట్టక బయటికి వచ్చి ఆకాశం వైపు చూస్తుంటే ఒక ధృవతార రాలిపోయినట్టు క్షణమాత్రంలో అనిపించింది.. పొద్దున్నే ఈ అప్రశాంతత..
అంతలోనే తెలిసింది పిడుగులాంటి కబురు.. ఎన్టీఆర్ ఇక లేరని..!
నిజమా..ఏం జరిగిందో.. ముందు రోజు రాత్రి పెద్దాయన ఇంట్లో చాలా జరిగాయని గుసగుసలు..పొద్దున్న టివిల్లో విపరీతమైన హడావిడి..సరే..ఏది నిజమైనా…ఏది వదంతైనా
ఒక శకం..కాదు కాదు.. ఒక యుగం ముగిసిపోయింది.. తన నటనతో శిఖరాగ్రానికి చేరుకుని..రాజకీయ విభవంతో చరిత్రను తిరగరాసిన నందమూరి తారక రామారావు
అఖండ కీర్తిని.. చెరిగిపోని యశస్సును.. మూడు వందలకు పైగా సినిమాల ప్రశస్తిని.. ఇంతకు మునుపెవ్వరూ సాధించలేని ప్రజాభిమానాన్ని విడిచి భువిని వదిలి నింగికి తరలిపోయాడు.
ఏమని వివరించాలి.. ఎన్నని చెప్పాలి.. వెండితెర రాముడా.. _చిలిపి కృష్ణుడా.._GVR అహంకారి రావణుడా.. మానధనుడు సుయోధనుడా.. ఓరోరి మాయాజ్యూత విజయా మదమదోన్మత్తా అంటూ కురుసభలో విరుచుకుపడిన భీమసేనుడా.. స్త్రీలోలుడు కీచకుడా.. మహావీరుడు అర్జనుడా.. అదే కిరీటికి మరో రూపమైన బృహన్నలా.. కురువృద్ధుడు భీష్ముడా…!
రాకుమారిని వరించిన తోటరాముడా.. చెల్లి కోసం పరితపించి పోయిన అన్నా..నలుగురు దేవకన్యలను మనువాడిన జగదేకవీరుడా.. తండ్రికి ఇచ్చిన మాట కోసం మారువేషం కట్టి గుండమ్మకూతుర్ని పెళ్లాడిన ఆంజనేయ ప్రసాద్.. ఉరఫ్ అంజా.. భువనవిజయుడు శ్రీకృష్ణ దేవరాయలా.. అందమైన చంద్రగుప్తుడా.. ముసలి బడిపంతులా.. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామా.. ఆరేసుకోయి పారేసుకున్న అడవిరాముడా.. మనవరాలిగా వేసిన పడుచుపిల్లతో ఆకు చాటు పిందె తడిసే అని గంతులేసిన వేటగాడా..! పోలీస్ గెటప్పులో అదిరిపోయిన కొండవీటిసింహమా.. న్యాయమూర్తి సెటప్పులో వెలిగిపోయిన జస్టిస్ చౌదరీ నా.. తానెవరో కొడుక్కి చెప్పలేక అల్లాడిపోయిన సర్దార్ పాపారాయుడా.. ఎంతకని వర్ణించాలి..!
రాసి మనం అలసిపోవాలి గాని వేసి పెద్దాయన డస్సిపోలేదు..మనదేశం నుంచి నాదేశం వరకు హిట్టు మీద హిట్టు కొట్టి.. ప్లాపులను పక్కకి నెట్టి నటుడిగా విశ్వరూపం ప్రదర్శించి..ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ దుర్భేద్యమైన కంచుకోట ను నిర్మించుకుని..1982 లో రాజకీయాల్లో అరంగేట్రం చేసి అక్కడా తానేమిటో నిరూపించుకున్న
అనితరసాద్యుడు నందమూరి తారక రామారావు అనే సమున్నత శిఖరం..!
క్రమశిక్షణ ఆయన నైజం.. మడమ తిప్పని విధం ఆయన పథం.. స్వరం ఆయన సంపద.. ఏ గెటప్పులోనైనా ఇట్టే ఇమిడిపోయే అద్భుతం ఆయన సొంతం.. రాజీ పడకూడదన్నది ఆయన పంతం.. గాంభీర్యం ఆయన తీరు.. తెలుగునాట సంచలనం సృష్టించిన చైతన్యరధం ఆయన తేరు..! ఒక్కో వ్యక్తి గురించి చెబుతూ నూటికో కోటికో ఒక్కరుగా పుడతారని అంటారు. కాని ఎన్టీఆర్ అంతకు మించిన అద్భుతం..విశేషం.. అలాంటి ఓ వ్యక్తి మళ్లీ పుట్టడు.. ఆయన ఒక్కడు.. చరిత్రలో ఒకే ఒక్కడు..!
🙏జయహో ఎన్టీఆర్ 🙏











