బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో గత రెండు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలను వరద నీరు ముంచెత్తాయి. ఆంధ్రప్రదేశ్ లో 294 గ్రామాలు ముంపు బారిన పడగా.. ఇప్పటి వరకు 13, 227 మంది ప్రజలను పునరావాస శిబిరాలకు ఏపీ సర్కార్ తరలించింది. వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకు తొమ్మిది మంది మృతి చెందారు. అయితే, భారీ వర్షాల వల్ల రోడ్లు అన్నీ పూర్తిగా జలమయమయ్యాయి.
తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు రేపు (సెప్టెంబరు 2) సెలవు …
అలాగే హైదరాబాద్ సహా తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో జనాలు అడుగు బయటపెట్టలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం రేపు (సెప్టెంబరు 2) సెలవు ప్రకటించింది. రేపు సాయంత్రం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పలు చోట్ల రహదారులపై భారీగా వరద నీరు ప్రవహిస్తోందని అన్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ రోడ్లు దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని సూచించారు.
ఇక, ఈ వర్షాల ప్రభావంతో హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మున్నేరు వరద ఉదృతితో నేషనల్ హైవే పై వరద నీరు చేరింది. దీంతో నందిగామ మండలం ఐతవరం గ్రామం దగ్గర 65వ జాతీయ రహదారి పైకి వరద ప్రవాహం కొనసాగుతుంది. నేషనల్ హైవేపై వరద నీరు చేరటంతో నందిగామ పోలీసులు రాకపోకలను పూర్తిగా నిలిపి వేశారు. నిన్న (శనివారం) కూడా జాతీయ రహదారి పైకి వరద నీరు చేరడంతో రాకపోకలు క్లోజ్ చేశారు. వరద తగ్గిన తరువాతనే మళ్లీ వాహనాలు రాకపోకలు ముందుకు సాగాయి. తాజాగా మళ్లీ వరద ఉదృతి పెరగడంతో హైదరాబాద్- విజయవాడ మధ్య రాకపోకలను నిలిపివేశారు .