కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో అమ్మాయిల వాష్ రూంలో సీక్రెట్ కెమెరా ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే విచారణ జరపాలని ఆదేశించారు. విద్యార్థినుల హాస్టల్ వాష్ రూంలో హిడెన్ కెమెరా ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలంటూ జిల్లాకు చెందిన మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్, ఎస్పీలకు చంద్రబాబు ఆదేశించారు. ముఖ్యమంత్రి సూచన మేరకు ఇప్పటికే మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ గంగాధర్ రావు, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ ఆ కాలేజికి వెళ్లి విద్యార్థినులతో మాట్లాడారు.
ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటూనే ఉన్నారు. కలెక్టర్, ఎస్పీలతో ఫోన్ లో మాట్లాడారు. విద్యార్థినుల ఆవేదన, ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని వేగంగా విచారణ జరపాలని తెలిపారు. సీక్రెట్ కెమెరాల ద్వారా చిత్రీకరణ జరిగిన విషయం నిర్ధారణ అయితే, అందుకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇది మన ఇంట్లో ఆడబిడ్డలకు వచ్చిన కష్టం అని భావించి, నిజాలు నిగ్గుతేల్చాలని పేర్కొన్నారు.
కాలేజి యాజమాన్యంపై విచారణ :
ఇక, విద్యార్థినుల ఫిర్యాదును కాలేజి యాజమాన్యం పట్టించుకోలేదనే ఆరోపణలపైనా కూడా విచారణ జరపాలని ఆదేశించారు. యాజమాన్యం నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. విద్యార్థినుల వద్ద ఆధారాలు ఉంటే నేరుగా నాకు పంపండి అని చంద్రబాబు సూచించారు. విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై ప్రతి మూడు గంటలకు ఒకసారి తనకు రిపోర్ట్ చేయాలని అధికారులను నిర్దేశించారు.
కాగా, ఈ వ్యవహారంలో దర్యాప్తు కోసం కృష్ణా జిల్లా పోలీసులు ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందానికి గుడివాడ క్రైమ్ విభాగం సీఐ రమణమ్మ నేతృత్వం వహిస్తారని జిల్లా ఎస్పీ గంగాధర్ రావు ప్రకటించారు. ఈ బృందంలో ఐదుగురు సాంకేతిక నిపుణులు కూడా ఉన్నారు. ఈ స్పెషల్ టీమ్ గుడ్లవల్లేరు లోని ఇంజనీరింగ్ కాలేజిని సందర్శించి దర్యాప్తుకు శ్రీకారం చుట్టింది. హిడెన్ కెమెరా ఆరోపణల నేపథ్యంలో, తాము నాన్ లినేయర్ జంక్షన్ డిటెక్టర్ (ఎన్ఎల్ జేడీ)ని ఉపయోగిస్తున్నామని ఎస్పీ వెల్లడించారు.